కొత్త అధ్యక్షుడు సునీల్ రెడ్డి తొలి పర్యటనలోనే ఝలక్
దిశ దశ, పెద్దపల్లి:
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రతికూలతను అందించినా పార్టీ మాత్రం అందలం ఎక్కించిన సంతోషం ఆ నాయకుడి దరి చేరకుండా చేస్తున్నాయి సొంత పార్టీ వర్గ విభేధాలు. పార్టీ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్ష్య పదవితో తన ప్రత్యేకతను చాటుకోవాలని కలలు కన్న ఆ నాయకుడికి తొలి ప్రయత్నంలోనే చుక్కలు చూపించాయి. రెండు ప్రత్యర్థి వర్గాలు. ఆందోళనలతో నెలకొన్న గందరగోళాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా వినకుండా అత్యుత్సాహం ప్రదర్శించారు ఇరు వర్గాల కార్యకర్తలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన బీజేపీ సమావేశం రసాభసాగా మారింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి తొలిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేశాయి. అయితే సభా ప్రాంగణానికి పార్టీ ప్రముఖులంతా చేరుకున్న తరువాత ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. తమ నాయకుడిని సమావేశానికి ఆహ్వనించలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయులు సభను అడ్డుకున్నారు. వేదిక వద్దకు చేరుకున్న ఆయన అనుచరులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కానీ జిల్లాలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన గుజ్జులను విస్మరించారంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దుగ్యాల ప్రదీప్ వర్గం కూడా గుజ్జుల వర్గాన్ని నిలువరించే ప్రయత్నం చేసింది. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకున్నప్పటికీ పరిస్థితి చేయి దాటిపోవడంతో తోపులాటకు దారి తీసింది. దీంతో జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి కార్యకర్తలను హెచ్చరించాల్సి వచ్చింది. సునీల్ రెడ్డి బాధ్యతలు తీసుకుని మొదటిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రచ్చరచ్చ కావడంతో పెద్దపల్లి జిల్లా బీజేపీలో లుకలుకలు మరోసారి వెలుగులోకి వచ్చినట్టయింది.
ఎంపీ ఎన్నికలకు ముందే…
ఓ వైపున జాతీయ నాయకత్వం పార్టీని బలోపేతం చేసి 51 శాతం ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో పాటు 400కు పైగా సీట్లు సాధించాలని పావులు కదుపుతోంది. దేశ వ్యాప్తంగా కూడా బీజీపీ బలమేంటో నిరూపించడంతో పాటు హ్యాట్రిక్ కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని బీజేపీ నేషనల్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. మోడి మానియాతో పాటు అయోధ్య రామాలయ ప్రారంభం తదితర అంశాలతో ప్రజల్లోకి వెల్లి బలాన్ని, బలగాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తుంటే పెద్దపల్లి జిల్లా బీజేపీ నాయకులు మాత్రం గొడవలకు దిగుతుండడం విడ్డూరం. త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలే టార్గెట్ గా ప్రచారం చేయాలని ముఖ్య నాయకులు కసరత్తులు చేస్తుంటే ఇక్కడి సీనియర్ నాయకులు మాత్రం జనాల ముందే గొడవలకు దిగి పార్టీని అభాసుపాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమన్వయంతో పనిచేయాల్సిన ముఖ్య నాయకులు కూడా సమావేశాల రసాభసాలకు కారకులు అవుతున్న తీరు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే విధంగా తయారయ్యాయి. గతంలో కూడా పెద్దపల్లి జిల్లా బీజేపీలో విబేధాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అదే పంథాలో పార్టీ నాయకులు ముందుకు సాగుతుండడం మాత్రం పార్టీ లీడర్లను విస్మయానికి గురి చేస్తోంది.