దిశ దశ, ఏపీ బ్యూరో:
భర్త చేసే తప్పిదాలతో తమ జీవితం బుగ్గిపాలైందని ఆరోపించే భార్యలను చూశాం. వివాహేతర బంధాలతో వైవాహిక బంధంతో ఒక్కటైన తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసే అతివల బాధలనూ విన్నాం. మామ కారణంగా తాము కష్టాలు ఎదుర్కొంటున్నామని, తమ భార్యలను మెట్టినింటికి పంపించాలని డిమాండ్ చేస్తున్న భర్తలు ఆందోళన చేపట్టి సరికొత్త చర్చకు తెరలేపారు.
ఏలూరులో…
ఏపీలోని ఏలూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఆందోళన గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తోడళ్లుల్లు ఇద్దరు కూడా నిరసన కార్యక్రమం చేపట్టి ఏకంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం కూడా అందించారు. తమ గోడు విని తమకు న్యాయం చేయాలని వారు అభ్యర్థించిన తీరు చర్చనీయాంశంగా మారింది. వి పవన్, బి శేషసాయి అనే ఇద్దరు తోడళ్లుల్లు ఏలూరులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ కు పంపించిన వినతి పత్రంలో బూరగడ్డ రామాంజనేయ అయ్యంగార్ కూతుర్లతో తమకు వివాహం అయిందని పేర్కొన్నారు. 2015లో పవన్ కు వివాహం జరగగా ఓ కూతురు కూడా జన్మించిందని, 2024లో శేషసాయికి వివాహం జరిగిందని అయితే కూతుర్లను తమతో కాపురానికి పంపించకుండా మామా వేదింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తమ భార్యలను పంపించాలని అభ్యర్థించినందుకు తమపై కేసులు పెట్టించాడని, తనకు ఉన్న పలుకుబడితో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టించి బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో వివరించారు. తమపై పెట్టిన అక్రమ కేసులను క్లోజ్ చేయించి తమ భార్యలను తమతో కాపురానికి పంపించాలని తోడళ్లుల్లు ఆ వినతి పత్రంలో కలెక్టర్ ను కోరారు.