విషాదం: సీనియర్ నటి జమున కన్నుమూత

సీనియర్ నటి జుమన (86) మృతి చెందారు. హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కన్నుమూశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించిన జమున.. ‘పుట్టిల్లు’ సినిమాతో తెరంగేట్రం చేశారు. జమున 1936 ఆగష్టు 30 న హంపీలో జన్మించారు. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. శ్రీనివాసరావు ఒక వ్యాపారవేత్త. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జమున బాల్యం గడిచింది. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో ‘ము’ అక్షరం చేర్చి జమునగా మార్చారు.

తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ‘ఖిల్జీ రాజ్య పతనం’ అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమునను తీసుకెళ్లాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడంతో సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు జమున తొలి చిత్రం. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్ర సత్యభామ క్యారెక్టరే. సత్యభామ కలాపంతో ప్రేక్షక జన హృదయాల్లో విహరించారు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి 198 సినిమాల్లో నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు.

తెలుగు, దక్షిణాది భాషలన్నటితో పాటు.. పలు హిందీ సినిమాల్లోనూ జమున నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇక, సీనియర్ నటి జమునకు కాంగ్రెస్ నాయకురాలు అంటే ఎంతో అభిమానం. ఆమెపై ఇష్టంతోనే జమున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పర్యటనలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కూడా ప్రచారం చేశారు. 1989లో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1991లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొంతకాలం అదే పార్టీలో కొనసాగారు. కొన్నేళ్ల తర్వాత జమున బీజేపీలో చేరారు. అలా సినిమాలతో పాటు ప్రజా జీవితంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.

You cannot copy content of this page