మంథనిలో మరో సంచలనం… మాజీ సర్పంచ్ వీడియో కలకలం

మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం..?

దిశ దశ, కాటారం:

మంథని నియోజకవర్గంలో మరో కలకలం లేచింది. మంత్రి శ్రీధర్ బాబును ఉద్ధేశించి మాజీ సర్పంచ్ వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. తమకు సరైన గుర్తింపు లేకుండా పోయిందంటూ మాజీ సర్పంచ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారింది. స్వర్గీయ శ్రీపాదరావు నుండి ఇప్పటి వరకు దుద్దిళ్ల కుటుంబంతోనే అనుబంధం పెనవేసుకున్నానని అయితే ఇటీవల కాలంలో పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమకు ప్రాధాన్యత లేకుండా పోవడమే కాకుండా పార్టీలో కొత్తగా జాయిన్ అయిన వారిని చేర్చుకుని వారికే అందలం ఎక్కిస్తున్నారంటూ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు అన్నదమ్ముల పేర్లు, ఆయన తల్లిదండ్రుల పేర్లను ఊటంకించిన మాజీ సర్పంచ్ తాను ఆ కుటుంబానికి విధేయునిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆ ఇంటి బిడ్డలాంటి వాడినని, శ్రీధర్ బాబు అంటే ఆరాధ్య దైవమని, ఆయనపై ఎలాంటి ద్వేషం లేదని, వారంటే తనకు ప్రాణమని వివరించిన ఆయన శ్రీపాదరావు, శ్రీధర్ బాబుల వెంట ఉన్న వారు మనో వేదనకు గురవుతున్నారన్నారు. గుంట నక్కలు అధికారంలో ఏ పార్టీ ఉంటే వారు వస్తున్నారని, వారు ముందు సీట్లో కూర్చోవాలన్నదే సిద్దాంతమని, కేసుల్లో ఇరుక్కున్నామని, దెబ్బల పాలయ్యామని సత్యనారాయణ అన్నారు. మంథని నుండి మహదేవపూర్ వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన వారందరూ నారాజ్ గురవుతున్నారన్నారు. పార్టీ కార్యకర్తలను ఆధరించాలని, విసిగిపోయినందువల్లే తానీ వీడియో షేర్ చేస్తున్నానని, అధికారంలో లేని 10ఏళ్ల పాటు చాలా కష్టాలు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ కార్యకర్తలు నరకయాతనకు గురయ్యారన్నారు. ఓ నాయకుడు శ్రీధర్ బాబు కారులో కూర్చోవడం ఏంటని ప్రశ్నించిన సత్యనారాయణ తామెందుకు ఉన్నామని సంక నాక ఉన్నామా అని అడిగారు. శ్రీధర్ బాబును ఉధ్దేశించి మాజీ సర్పంచ్ చేసిన వ్యాఖ్యల్లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.

మంత్రి సీరియస్..?

విలాసాగర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద‌ృష్టికి వెల్లినట్టుగా తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లో ఉన్న ఆయనకు ఈ విషయం తెలిసిన తరువాత పూర్తి వివరాలను సేకరించినట్టుగా స్థానికంగా ప్రచారం అవుతోంది. మాజీ సర్పంచ్ తో కలిసి మరో నాయకుడు ఉన్నారన్న విషయం కూడా మంత్రికి తెలిసినట్టుగా సమాచారం. తన సోదరుడు శ్రీను బాబు అందరితో టచ్ లోనే ఉంటుండగా, తాను కూడా నియోజకవర్గ క్యాడర్ తో కలుస్తున్నప్పుడు చెప్పుకునే విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా రాద్దాంతం చేయడం అవసరమా అని, ఆత్మహత్యయత్నం చేసుకునేంత పరిస్థితులు ఎందుకు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరో నాయకుని ప్రోద్భలంతోనే మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఇలా వ్యవహరించారని కాటారం మండలానికి చెందిన కొంతమంది మంత్రి పార్టీ నాయకులు శ్రీధర్ బాబుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో సదరు నాయకుని వ్యవహార శైలిపై కూడా ఆయన మండిపడినట్టుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

You cannot copy content of this page