అరంగ్రేట్రంతోనే సంచలనం… ప్రసన్న హరికృష్ణ సక్సెస్… ఫెయిల్యూర్…

దిశ దశ, కరీంనగర్:

తొలిసారి ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చేసిన గ్రౌండ్ వర్క్ అంతా ఇంతా కాదు. తన వ్యక్తిగత పరిచయాలతో పాటు శిక్షణార్థులు కూడా చేదోడుగా కలిసివచ్చిన అంశం. పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రుల ద్వారా మాత్రమే ప్రచార పర్వాన్ని కొనసాగించిన తీరు ప్రత్యర్థులకు కూడా అంతుపట్టలేదు. సోషల్ మీడియా వేదికగా తన అస్త్రాలను సంధిస్తూ ముందుకు సాగిన ఆయన ఓటరును ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు.

ప్రసన్న హరికృష్ణ…

కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన ప్రసన్న హరికృష్ణ చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకు సాగారు. తనకున్న ఇమేజ్ బేస్ చేసుకుని ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. చివరి నిమిషంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముఖత చూపిన ఆయన కార్యరంగంలోకి దూకారు. బీసీ కార్డు నినాదం బలంగా వినిపిస్తున్న సమయంలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు మరింత కలిసి వచ్చిందని చెప్పవచ్చు. సమీక్షలు చేస్తూ, సమావేశాలు నిర్వహించుకుంటూ ఆయన వేసిన ఎత్తులు ప్రత్యర్థి పార్టీలకు కూడా అంతు చిక్కలేదనే చెప్పాలి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రసన్న హరికృష్ణను పరిగణనలోకి తీసుకోనట్టుగా వ్యవహరించినప్పటికీ ఆయన లక్ష్యంగా విమర్శలు చేయడం, ట్రోల్స్ చేయడం వంటి చర్యలకు పూనుకున్నారంటే పోలింగ్ సమయం దగ్గర పడినకొద్ది ఆయన ప్రభావం ఎంతమేర పడిందని గమనించారో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రసన్న హరికృష్ణ హంగూ ఆర్బాటం లేకుండా సాగించిన ప్రచారం తీరుతో మూడో టఫ్ ఫైట్ ఇచ్చారనే చెప్పాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఆయన సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టుగానే భావించాలి. అంతగా క్యాడర్, లీడర్లు లేని బీఎస్పీ పార్టీ తరుపున బరిలో నిలిచిన ఆయన అన్నీ తానై నడిపించుకున్న తీరు, ఓటర్లను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేసిన వ్యూహాలు ఎంతమేరో గమనించవచ్చు. రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయాల్సిన ఆవశ్యకత అయితే తప్పని సరిగా ఉంటుంది. అయితే ఇంతకాలం క్రీయాశీల రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రసన్న హరికృష్ణ పట్టభద్రులను ఆకట్టుకోవడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మూడో స్థానంలో నిలిచిన ఆయన తొలి ప్రాధాన్యతలో 60419 ఓట్లు సాధించకోవడం ఆశామాషీ వ్యవహారం కాదు. సొంత క్యాడర్ సొంత ఎజెండాతోనే ప్రచారం చేసుకుంటూ దూసుకపోయిన తీరు సంచలనమనే చెప్పాలి.

మౌత్ టు మౌత్…

ప్రసన్న హరికృష్ణ విషయంలో అత్యంత కీలక పరిణామం మాత్రం మౌత్ టు మౌత్ పబ్లిసిటీ తీవ్రమైన ప్రభావం చూపింది. నిరుద్యోగులకు కోచింగ్ ఇచ్చిన ఆయన గురించి చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసిన వారే ఎక్కువ. ఉస్మానియా యూనివర్శిటీతో ఉన్న అనుబంధం కూడా ఆయనకు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాల్లో ఒకటి. వ్యక్తిగత పరిచయాలు ఉన్న వారు వివిధ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న వారంతా కూడా ఆయన గెలుపులో కీలక భూమిక పోషించారు. చాలామంది అధికారులు, విద్యారంగంలో ఉన్న వారు ప్రసన్న హరికృష్ణ గురించి వివరించి ఆయనకు అనుకూలంగా మల్చడంలో ప్రధాన పాత్ర పోషించారు.

పోల్ మేనేజ్ మెంట్…

ప్రసన్న హరికృష్ణ తన గెలుపు కోసం వేసిన వ్యూహ రచనలో సఫలం అయినప్పటికీ ఓటర్లను తనకు అనుకూలంగా మల్చుకోవడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయారు. దీంతో ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చిందన్నది వాస్తవం. పోల్ మేనేజ్ మెంట్ చేయడంలో ఆయన కృతార్థులు కాలేకపోవడం వల్లే మండలిలోకి అడుగు పెట్టాలన్న లక్ష్యానికి గండి పెట్టినట్టయింది.

అది కూడా…

చాలా వరకు హరికృష్ణకు సెకండ్ ప్రయారిటీ ఓటు అయినా వేయాలని, ఆ ఓట్లతో అయినా ఆయన గెలుస్తారన్న ధీమాను ఆయన అనుచరులు, అభిమానులు ప్రదర్శించారు. రెండో ప్రాధాన్యత ఓటు అనే అంశం తీవ్రంగా ప్రచారం జరగడం కూడా ఆయనకు కొంతమేర నష్టాన్ని చేకూర్చిందని చెప్పక తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అత్యంత కీలకమే అయినప్పటికీ ఆయన తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించుకోవడంలో మొదటి వరసలో నిలిచినట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయనకు మరింత కలిసి వచ్చేవి. అయితే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఎలిమినేషన్ రౌండ్ తో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారన్న విషయంపై అవగాహన లేకపోవడం కూడా ఓ రకంగా నష్టాన్ని చూపించిందన్నది నిజం. పార్టీల వారిగా అయినా బలమైన అభ్యర్థుల కారణంగా అయినా రెండో ప్రాధాన్యత ఓట్లు వేస్తే ఆయన గెలవడం పక్కా అన్న విషయాన్ని బలంగా వినిపించడంతో ఎలిమినేషన్ రౌండ్ అంశం ఆయనకు ప్రతికూలతను చేకూర్చింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేసిన వారు కూడా ప్రసన్న హరికృష్ణకు రెండో ప్రాధాన్యత ఓటు వేసి ఉండవచ్చు. కానీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తొలి ప్రాధాన్యత ఓట్లలో మొదటి స్థానంలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలవడంతో ఎలిమినేషన్ విధానం ద్వారా హరికృష్ణను పోటీ నుండి తప్పించే ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన బ్యాలెట్ లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరెవరికి వేశారన్న లెక్కలు తేల్చి ఆయా అభ్యర్థులకు వాటిని జమ చేస్తారు. ఒకవేళ ప్రసన్న హరి కృష్ణ టాప్ 2లో ఉన్నట్టయితే మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్లలో వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయనకు కలిసి వచ్చేవి. మరోవైపున ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించి ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని విస్మరించిన తీరు కూడా ఆయనకు కొంతమేర నష్టాన్నే చేకూర్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా తన పంచన చేరిన వారితోనే సరిపెట్టుకోకుండా ఓటర్లను ప్రభావితం చేసే శక్తులు, సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులను సమీకరించుకుని ముందుకు సాగడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయారు. కేవలం తన ఇమేజ్ మాత్రమే బలంగా ఉంటుందని అంచనా వేసుకున్న ఆయన క్షేత్ర స్థాయిలో ప్రభావిత చేసే శక్తులను కూడా గుర్తించినట్టయితే ఈ ఫలితాల ప్రభావం మరో విధంగా ఉండేదన్నది వాస్తవం. ఆయనకు అనుకూలంగా జరిగిన ప్రచారంలో ఓటింగులో పాల్గోనేందుకు అర్హత లేని వారే ఎక్కువ అన్న విషయాన్ని గమనించి పట్టభద్ర ఓటర్లను మరింత మందిని తనకు అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టలేకపోయారు. వాస్తవంగా ప్రసన్న హరికృష్ణ విషయంలో సొసైటీలో వచ్చిన సానుకూలతను గమనించిన ఆయన హితులు, సన్నిహితులు గెలుపు ధీమాతో వ్యవహరించిన తీరు కూడా నష్టాన్ని చేకూర్చింది. సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎలాంటి నినాదాలు ఇవ్వాలని, స్థానికత అంశాల గురించి కూడా పట్టించుకోనట్టుగా అనిపిస్తోంది.

కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడిన ప్రసన్న హరికృష్ణ

You cannot copy content of this page