సుఖేష్ చంద్రశేఖర్ లేఖ కలకలం

ఆప్, బీఆర్ఎస్ పార్టీలపై ఆరోపణలు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైనా ఆరోపణలు

ఛాటింగ్ రిలీజ్ చేస్తానని ప్రకటన

దిశ దశ, న్యూఢిల్లీ:

తీహార్ జైలులో ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉండడం సంచలనం కల్గిస్తోంది. మనీల్యాండరింగ్ వ్యవహారంలో తాను ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్ డైరక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి​ రూ.75 కోట్లు ఇచ్చానన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీకి రూ.15 కోట్లు చొప్పున ఐదుసార్లు మొత్తం రూ.75 కోట్లు ఇచ్చానని, హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానని వివరించారు. త్వరలో కేజ్రీవాల్ తో మాట్లాడిన వాట్సాప్ చాట్ బయటపెడతానని సంచలన ప్రకటన చేశారు. దాదాపు 700 పేజీల వాట్సాప్​ ఛాట్​ తన వద్ద ఉందన్న సుఖేష్ పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ ఆఫీస్​ ముందు రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060లో కూర్చున్న ‘ఏపీ’ అనే వ్యక్తికి తాను డబ్బులిచ్చానని వివరించాడు. కేజ్రీవాల్‌ను త్వరలో తీహర్ ‘క్లబ్‌కు’ ఆహ్వానిస్తానంటూ ఇటీవల కోర్టుకు హాజరైనప్పుడు సుఖేశ్ చంద్రశేఖర్ మీడియా ముందు కామెంట్ చేశారు. తాజాగా కేజ్రీవాల్​ లక్ష్యంగా రాసిన లేఖలో సీఎం కేసీఆర్ పార్టీ పేరు ప్రస్తావనకు తీసుకరావడం చర్చకు దారి తీసింది. కేజ్రీవాల్‌ తరపున రూ. 75 కోట్లు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న నాయకునికి అందించినట్టుగా ఆరోపణలతో కూడిన ఈ లేఖను తన లాయర్ అనంత్ మాలిక్ ద్వారా బయట పెట్టాడు.
రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి, వారి భార్యల దగ్గర నుంచి రూ. 200 కోట్లు వసూలు చేసిన కేసులో గతేడాది ఫిబ్రవరిలో సుఖేశ్​ చంద్రశేఖర్​ తీహార్​ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. తాజాగా సుఖేష్ రాసిన ఇరు రాష్ట్రాల పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ఉండడం సంచలనంగా మారింది. 2020లో బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు వచ్చి రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చినట్లు సుఖేష్ లేఖలో తెలిపారు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు డబ్బులు చెల్లించానని, వారం రోజుల్లో కేజ్రీవాల్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు వస్తాయని ఆ లేఖలో బాంబు పేల్చారు.

కిలో నెయ్యంటే..?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో చేసుకున్న ఛాటింగ్ లో కోడ్ పదాలు వాడినట్టు సుఖేష్ చంద్రశేఖర్ ఆ లేఖలో వెల్లడించారు. 15 కేజీల నెయ్యి ఏపీ అనే అతనికి ఇవ్వాలని సూచించారని, అంటే రూ.15 కోట్లని కోడ్ పెట్టుకున్నామని ఈ మేరకు తాను ఆ డబ్బు బీఆర్ఎస్ ఆఫీసు సమీపంలోని రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి ఇచ్చానన్నారు. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో తాను చేసిన మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేశానన్నారు. కేజ్రీవాల్ కు 2020కి సంబంధించిన చాట్ ట్రైలర్‌ చూపించబోతున్నానని ఆ లేఖలో రాశారు. మిస్టర్ జైన్ సెట్ చేసిన 15 కిలోల నెయ్యి కోడ్, నేను వ్యక్తిగతంగా డెలివరీ చేశానని, మీ తరపున రూ. 15 కోట్లు చెల్లించానని కూడా తెలిపారు. అప్పటి టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఏపీ అనే వ్యక్తికి ఇచ్చానని చెప్తుండడాన్ని బట్టి చూస్తే లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్న అరుణ్ పిళ్లై పేరు అయి ఉంటుందన్న ఊహాగానాలు వస్తున్నాయి లిక్కర్ స్కాం కేసులో ఈడీ కోర్టుకు సమర్పించిన డాక్యూమెంట్లలో అరుణ్ పిళ్లైని ‘ఏపీ’ అని పిలిచేవారని వెల్లడించడం గమనార్హం. పిళ్లై కవిత బినామిగా కూడా పేర్కొన్న నేపథ్యంలో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో సుఖేష్ చంద్రశేఖర్ చెప్తున్న ఏపీ ఒకరే అయి ఉంటారని అనుమానిస్తున్నారు.

బీజేపీ డ్రామా…

ఇదంతా బీజేపీ డ్రామయేనని కావాలని తమ పార్టీని ఇరికించేందుకు లేఖ సృష్టించిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సిద్దా రామయ్య పేరు, వచ్చే లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పేరు కూడా ఇరికిస్తూ లేఖలు విడుదలైనా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అమిత్ షా డైరక్షన్ లో బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే కుట్ర జరుగుతోందని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది.

ఛాటింగ్ విడుదలైతే…?

వారం రోజుల్లో వాట్సప్, టెలిగ్రాం ఛాట్స్ ను విడుదల చేయబోతున్నానని సుఖేష్ చంద్రశేఖర్ ప్రకటించడం కూడా ప్రస్తావనార్హం. ఆయన రాసిన లేఖ ప్రకారం 700 పేజీల చాటింగ్స్ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అవి మీడియాకు, కోర్టు ముందుకు వచ్చినట్టయితే మాత్రం అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. ఛాటింగ్ పై దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగి టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా సేకరించే అవకాశాలు ఉన్నాయి.

‘ఏపీ’ ఆయనే అయితే…?

సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖలో పేర్కొన్న ఏపీ, లిక్కర్ స్కాంలో ఈడీ చెప్తున్న ఏపీ ఒక్కరే అయితే మాత్రం అరుణ్ రామచంద్ర పిళ్లైని జాతీయ దర్యాప్తు సంస్థలు మరో కేసులో విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. సుఖేష్ ఆరోపిస్తున్నట్టుగా రూ. 75 కోట్లు ఆయన సొంతానికి వాడుకున్నారా వేరే వారికి ఇచ్చారా అన్న విషయాలపై ఆరా తీయనున్నాయి. ఆయన సొంతానికే వాడుకున్నట్టయితే సుఖేష్ చంద్రశేఖర్, ఢిల్లీ సీఎంకు మధ్య ఏపీకి పరిచయం ఎలా అయింది..? బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వద్దే ఎందుకు ఉండాల్సి వచ్చింది..? ఆ పార్టీకి సంబంధించిన వారెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టనున్నాయి. వేర్వేరు వ్యక్తులయితే మాత్రం అతన్ని అరెస్ట్ చేసి కూపీ లాగే అవకాశాలు ఉన్నాయి. అయితే సుఖేష్ వాట్సప్, టెలిగ్రాం ఛాటింగ్స్ లో ఏపీతో జరిపిన ఛాటింగ్ బయటపడినట్టయితే మాత్రం ఏపీ ఎవరోనన్నది స్ఫష్టం కానుంది. అయితే మనీ ల్యాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్న సుఖేష్ కూడా హైదరాబాద్ కు వచ్చినట్టు చెప్తున్నందున ఆయన రూ. 75 కోట్లు ఎలా తరలించారు, ఆయన చెప్తున్న రోజుల్లో మొబైల్ లోకేషన్ తదితర విషయాలు, ఏపీ, సుఖేష్ కలిసినప్పుడు కాల్ డాటా రికార్డ్స్ కు సంబంధించిన లోకేషన్ మ్యాప్స్ కూడా దర్యాప్తు సంస్థలు సేకరించనున్నాయి.

You cannot copy content of this page