దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ప్రకటించిన తరువాత ఈటల రాజేందర్ తన తొలి పర్యటన మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టారు. మంగళవారం సాయంత్రం మహేశ్వరం నియెజకవర్గానికి చెందిన శ్రీరాములు యాదవ్ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… పేదరికంలో మగ్గిపోతున్న దంపతులిద్దరికీ కూడా పెన్షన్ ఇవ్వనున్నామని ప్రకటించారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందించే జిమ్మేదారీ కూడా బీజేపీదేనన్నారు. మనుషులను చంపే సంపాదన అవసరం లేదని రాష్ట్రంలోని బెల్ట్ షాపులను ఎత్తేస్తామని, పోలీసు ఫైన్ వేధింపులు లేకుండా చేస్తామని, ప్రధాని మోడీ అండతో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించే బాధ్యత తమేదనన్నారు. తమ యావ, చూపు అంతా కూడా పేదవాళ్ల వైపే ఉంటుందని, ఈ కురుక్షేత్రంలో కౌరవులపై విజయం తమదేనని, ప్రజలు ధర్మం వైపు ఉండి తీరుతారని ఈటల వ్యాఖ్యానించారు.