మంత్రి, ఎంపీలే లక్ష్యంగా ఆరోపణలు…
ఆధారాలూ ఉన్నాయంటున్న సీనియర్ నేత
దిశ దశ, కరీంనగర్:
సంచలచన ఆరోపణలు చేయడంలో ముందు వరసలో ఉండే ఆ మాజీ ఎమ్మెల్యే మరోసారి కరీంనగర్ జిల్లా నాయకులే లక్ష్యంగా ఆరోపణలకు దిగారు. దాదాపు ఏడాది తరువాత కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఇక్కడ జరిగిన అక్రమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బీజేపీ, బీఆరెఎస్ నాయకులిద్దరిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హాట్ కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లు ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ తో పనిచేస్తున్నారని, అన్ని అక్రమ వ్యవహారాల్లో వీరిద్దరికి వాటా ఉందంటూ గోనె ప్రకాష్ రావు ఆరోపణలు చేశఆరు. ఎంపీ బండి సంజయ్ పై కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని, సీఎం కేసీఆర్ సమయం ఇస్తే మంత్రి గంగుల కమలాకర్ కు సంబంధించిన వివరాలన్ని తెలియజేస్తానని ప్రకటించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో కోట్లాది రూపాయల కమిషన్లు చేతులు మారుతున్నాయని గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. మరో వైపున గత సంవత్సరం కరీంనగర్ లో నిర్వహించిన కళోత్సవాలపై కూడా గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ కళోత్సవాల పేరిట ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. కోట్లు వసూలు చేసి లెక్కలు తేల్చలేదని, పోలీసులచే వ్యాపారస్థుల నుండి విరాళాలు వసూళ్లు చేయించారని ఆయన ఆరోపించారు. తాను చేస్తున్న ప్రతి ఆరోపణకు కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయని గోనె ప్రకాష్ రావు స్పష్టం చేశారు.