ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్నారు. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ బీఆర్ఎస్‌లో కలకలం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న పొంగులేటి.. ఆ పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తూ ప్రకంపనలు రేపుతోన్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోన్నాయి.
సోమవారం జిల్లాలో జరిగిన ఆత్మీయ సమావేశాలో పాల్గొన్న పొంగులేటి.. మూడేళ్లుగా చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. తనను జైల్లో పెట్టినా వెనకడుగు వేయనంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తాను వెనక్కి తగ్గనని, కుట్రలు, కుతంత్రాలకు భయపడనని అన్నారు. బీఆర్ఎస్ లో తనను నమ్ముకున్న వారికి ఎలాంటి పదవులు దక్కలేదని, రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలతోనే ఉంటానని అన్నారు.
ప్రాణం ఉన్నంతవరకు ప్రజలతోనే ఉంటానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తనను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని, అయినా తాను ఎదుర్కొంటానని అన్నారు. కార్యకర్తలు ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తనను నమ్మకున్న వారిని ఇబ్బందులకు గురి చూస్తే ఊరుకోనని, అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తానని చెప్పారు. అవసరమైతే జైలుకైనా పొతానంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బీఆర్ఎస్ పార్టీపై పొంగులేటి వ్యాఖ్యలు చేస్తుండటంతో.. ప్రభుత్వం ఆయనకు గన్ మెన్లను తగ్గించింది. తనకు గన్ మెన్లను తగ్గించినా తాను పట్టించుకోనని, తాను అడిగితే గన్ మెన్లను ఇవ్వలేదని అన్నారు. అయితే త్వరలో పొంగులేటి పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీలో చేరుతారని భావించిన గత నాల్గైదు రోజులుగా ఆయన స్వరం మార్చడం సరికొత్త చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయనను కలుస్తున్న నేపథ్యంలో ఆయన కాషాయం వైపు మొగ్గు చూపుతారా లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్న తర్జనభర్జనలు మొదలయ్యాయి. మరో వైపున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ కానున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఆయన విరుచుకుపడుతున్నారు.