కురుక్షేత్రంలో కొట్టుకుపోవడం ఖాయం.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్నారు. బీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా ఆ పార్టీపై అక్కసు వెల్లగక్కుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఆయనను పార్టీ నుంచి బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు. బీఆర్ఎస్‌లో ఎదుర్కొన్న అవమానాలను పొంగులేటి బయటపడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి పార్టీలో చేరానని, కానీ తనను మోసం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలిపారు. మధిర మున్సిపాలిటీలో తన వల్లే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వం మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటుందని, అసలు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, అధికారం ఎవరి సొత్తు కాదని చెప్పారు. రాబోయే కురుక్షేత్రంలో మీరు కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

అయితే పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ నెలలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ పడ్డాను కలుస్తారని, కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి చేరలేదు. ఆయనకు కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పొంగులేటి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన వైఎస్సార్‌టీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది.అయితే కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం వచ్చిందని, ఆ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి.దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఏ పార్టీలో చేరారనే దానిపై పొంగులేటి ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.

You cannot copy content of this page