దిశ దశ, వరంగల్:
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నెలకొన్న వివాదాలు రోజు రోజుకు ముదిరి పాకానపడ్డట్టుంది. పూర్వ పాలకవర్గంలోని కొంతమంది బాధ్యులపై వచ్చిన ఆరోపణలు క్రిమినల్ కేసుల వరకు చేరడం… తాజాగా సభ్యత్వం రద్దు చేసే పరిస్థితికి రావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న క్రమంలో ఉన్నట్టుండి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సమావేశం తీసుకున్న నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. నిన్న మొన్నటి వరకు ప్రెస్ క్లబ్ కమిటీలో కీలక బాధ్యతల్లో ఉన్న వారి సభ్యత్వం రద్దు చేస్తూ సమావేశం నిర్ణయించడం గమనార్హం. శనివారం జరిగిన వరంగల్ ప్రెస్ క్లబ్ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన కమిటీ పలు తీర్మాణాలను ఆమోదించింది. ప్రజా స్వామ్యబద్దంగా ఎన్నికైన కమిటీపై దుష్ప్రచారం చేస్తున్న సభ్యులపై కఠినంగా వ్యవహరించాలని… నిబంధనలను పాటించని వారి సభ్యత్వం తొలగించాలని సమావేశం అభిప్రాయపడింది. గత కమిటీలో అధ్యక్ష్య, కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తించిన తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాళ్ల వెంకట్ ల ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేస్తూ సమావేశం తీర్మాణించింది. క్లబ్ ఆర్థిక లావాదేవీల విషయంలో చెక్ పవర్ ఉన్న వారే బాధ్యులు అవుతారు కానీ… పాలకవర్గం అంతా బాధ్యత వహిస్తుందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని సమావేశం తప్పుపట్టింది. పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించిన వివరాలను అందించామని, ఇంకా ఏమైన ఆధారాలు కావాలన్నట్టయితే వాటిని కూడా పోలీసులకు అందజేసేందుకు సిద్దంగా ఉన్నామని, ముందు ముందు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఫీజులు క్లబ్ నిధుల నుండి చెల్లించాలని సమావేశం నిర్ణయించింది. ప్రెస్ క్లబ్ కు సంబంధించిన అంశాలను కమిటీకి తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ బాక్సును ఏర్పాటు చేయాలని, దీని ద్వారా వచ్చిన సలహాలు సూచనలు, ఫిర్యాదులను ప్రతి వారం సమీక్షించాలని కూడా తీర్మాణించింది. ప్రెస్ క్లబ్ అద్దెలు పెంచడంతో పాటు స్పోర్ట్స్ నిర్వహించడం తదితర అంశాలపై ప్రెస్ క్లబ్ తీర్మాణం చేసింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కొశాధికారి బొల్ల అమర్, ఉపాద్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపల్లి దుర్గాప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ, యంసాని శ్రీనివాస్,
జాయింట్ సెక్రెటరీ డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్థన్, ఈసీ మెంబర్లు, వీరగోని హరీష్, జనగాని ఆంజనేయులు, యండి నయీంపాషా, కమటం వేణుగోపాల్, కందుకూరి సంజీవ్, నన్నపనేని భరత్, మంచాల రాజు, బాలవారి విజయ్… ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.