దిశ దశ, హైదరాబాద్:
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చరిత్రలో ఏ పోలీసు అధికారి తీసుకోని విధంగా ఆయన వ్యవహరించడం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న 85 మందిని ఏక కాలంలో బదిలీ చేశారు. సర్కిల్ ఇన్స్ పెక్టర్ నుండి హోం గార్డు వరకు ప్రతి ఒక్కరికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. వారికి అలాట్ చేసిన చోటకు వెల్లి జాయిన్ కావల్సి ఉంది. ఒకే సారి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న అందరిని బదిలీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశ చరిత్రలో కూడా ఇదో అత్యంత అరుదైన ఘటనగా చెప్పవచ్చు.
నిను వీడని నీడను నేనే…
పంజాగుట్ట పోలీసులను ఆ నీడలు వెన్నంటినట్టే కనిపిస్తున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్ ప్రగతి భవన్ సమీపంలో డివైడర్లను ఢీ కొట్టిన సంఘటనలో నిందితుడిని మార్చిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే ఓ సీఐ సస్సెండ్ కాగా మరో సీఐ అరెస్ట్ అయ్యారు. పలువురిపై కేసు నమోదు కాగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పంజాగుట్ట స్టేషన్ లో పనిచేస్తున్న స్టాఫ్ మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పుణ్యమా అని ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు తాజాగా మరో సంచలన నిర్ణయానికి కారణమైంది. ఎమ్మెల్సే షకీల్ కొడుకు యాక్సిడెంట్ ఘటన తరువాత స్టేషన్ అంతర్గత విషయాలు కూడా బయటకు పొక్కుతున్నాయన్న విషయాన్ని గుర్తించే ఈ బదిలీలు చోటు చేసుకున్నాయన్ని సమాచారం.