దిశ దశ, దండకారణ్యం:
సాయుధ పోరుతో పాటు బ్యాలెట్ పోరు కూడా ముఖ్యమేనని భావించిన జనశక్తి నక్సలైట్లు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. బూర్జువా విధానాలపై తుపాకి ఎక్కు పెట్టిన జనశక్తి విప్లవ పార్టీ ఇచ్చిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. విప్లవ పంథాలో కొనసాగినప్పటికీ ఎలక్షన్ పంథా కూడా తమ పోరాటంలో ఓ భాగంగా కొనసాగించిన జనశక్తి తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. జనశక్తి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి గంగాధర్ పేరిట విడుదల అయిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనశక్తి పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక కారణాలు ఏంటన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఎన్నికలను బహిష్కరించాలంటూ జనశక్తి అధికార ప్రతినిధి గంగాధర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గతంలో సీపీఐ ఎంఎల్ జనశక్తి పార్టీ తరుపున ఎమ్మెల్యేలు కూడా గెలిచిన చరిత్ర ఉంది. కానీ తాజాగా ఆ పార్టీ ఎన్నికల బహిష్కరణ పల్లవి ఎత్తుకోవడంతో సరికొత్త పంథాను ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. గతంలో తనకు పట్టున్న ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల్లోనూ జనశక్తి తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి బహిష్కరణ పిలుపును ఇవ్వడానికి కారణాలు మాత్రం తెలియరావడం లేదు. హిందుత్వ ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఎన్నికలు బహిష్కరించాలని గంగాధర్ పిలుపునిచ్చారు.
జనశక్తి రాసిన లేఖ పూర్తి సారంశం ఇదే…
సి.పి.ఐ (ఎం-ఎల్) జనశక్తి కేంద్ర కమిటీ
పత్రికా ప్రకటన
బూర్జువా ఎన్నికలను బహిష్కరిస్తూ విప్లవ ప్రత్యామ్నాయ నిర్మాణానికై ముందడుగు వేద్దాం. హిందుత్వ పేరిట దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడం, అవినీతికి రాజముద్ర వేసుకోవడమే ప్రజాస్వామ్యమా అంటూ పాలకులను నిలదీద్దాం.
ఇదే సంవత్సరం 2023 నవంబర్ మాసంలో తెలంగాణతో పాటు ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం లాంటి ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పాలక పార్టీలు కోట్లాది ధనరాసులను వెదజల్లుతూ, మద్యాన్ని ఏరులై పారిస్తూ ఓటర్లను మభ్యపరచడానికి అనేక బూటకపు వాగ్దానాలు చేస్తున్నారు. ఉచితాలను ఒకరిపై ఒకరు పోటీ పడి ప్రజలను ఊరిస్తున్నారు.
1952 నుండి మొదలై ప్రజాస్వామ్యం పేర గడిచిన ఏడు దశాబ్దాలుగా సాగుతున్న ఎన్నికల తంతు పాలకులకు కొత్త కాదు. ప్రజలకు వింత కాదు. రాష్ట్రాలు, దేశం అంటూ విశదీకరించి చెప్పిన రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కి జమిలి ఎన్నికలు అంటూ, దేశ భిన్నత్వాన్ని కాలరాయడానికి కామన్ సివిల్ కోడ్ అంటూ హిందుత్వను రాజకీయ సాధనంగా వాడుకుంటున్న బిజెపితో పాటు అవినీతిలో మునిగితేలుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ దోపిడీ విధానాలకు రాజముద్ర వేయించుకోవడానికి సాగుతున్న బూర్జువా ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు సి.పి.ఐ (ఎం-ల్) జనశక్తి పిలుపునిస్తుంది. విప్లవ ప్రత్యామ్నాయ నిర్మాణానికి పూనుకోవడమే ఇందుకు పరిష్కారమని స్పష్టం చేస్తున్నది. దున్నేవారికి భూమి దక్కి, పరిశ్రమలను జాతీయం చేస్తూ, విదేశీ సామ్రాజ్యవాద దోపిడిని బ్రాహ్మణీయ కుల వ్యవస్థను రద్దు చేయకుండా దేశానికి నిజమైన ప్రజాస్వామ్యం- స్వేచ్ఛ- స్వాతంత్ర్యాలు లభించవు. అది ఎన్నికల ద్వారా సాధ్యం కాదని గడిచిన 71 సంవత్సరాలుగా రుజువు అవుతున్నది. అందుకే అర్ధభూస్వామ్య-అర్ధవలస దోపిడితో నిండిన బ్రాహ్మణీయ కుల-వర్గ వ్యవస్థను సమూలంగా మార్చే దిశగా ప్రజాయుద్ధ మార్గాన్నెంచుకుని సాగుతూ ఐదేళ్లకోసారి ప్రజల ముందుకు వచ్చే పాలకవర్గాలను నిలదీయాలని కోరుతున్నాము. ఆర్థిక-రాజకీయ-సామాజిక రంగాల్లో ప్రజా వ్యతిరేక ఎజెండాను బట్టబయలు చేయాలని కోరుతున్నాం.
75 సంవత్సరాల “స్వాతంత్య్ర ” ఉత్సవాలను పూర్తి చేసుకున్న దేశంలో పేదరికం రూపుమాసి పోలేదు. పైగా ఆదాని- అంబానీ లాంటివాళ్ళు ప్రపంచకుబేరులుగా రంగం మీదకు వస్తున్నారు. ప్రజలపై ప్రత్యక్ష పరోక్ష పన్నుల భారం పెంచిన పాలకవర్గాలు, కార్పొరేట్ దోపిడీదారులకు రాయితీలిస్తూ, 12 లక్షల కోట్ల రుణదారులను డిఫాల్టర్లుగా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి దోపిడీదారుల నుండి లభిస్తున్న ఎన్నికల బాండ్లు వందల కోట్లు దాటి పోతుండడం గమనిస్తే ఇవి అధికార పార్టీల క్విడ్ ప్రో- కో లని స్పష్టమవుతున్నది. గ్రామీణ స్వావలంబణాయుత వ్యవసాయాన్ని పరాధీనం చేసిన పరాధీన భారతంలో 25 కోట్లకు పైగా యువతీ యువకులు ఉపాధి గ్యారెంటీ, గృహ వసతి గ్యారెంటీ లేకుండా నగరాల్లో అర్ధాకలితో జీవిస్తున్న విషయం కరోనాకాలం బట్టబయలు చేసింది. ఇలాంటి ఎంతోమంది అన్నార్తుల్లో ఆకలి ఆక్రందనలు సృష్టించిన భారతంలో విద్యా-వైద్య రంగాలు నిలకడగా ఎలా అభివృద్ధి కాగలవో ఆలోచించాలి. లాభసాటి పబ్లిక్ రంగ పరిశ్రమలు, సేవా రంగాలను ప్రైవేటుపరం చేయడమే గాకుండా, మధ్యతరగతి వర్గం దాచుకుంటున్న జీవిత భీమా సొమ్ముపై, ఆరోగ్య భీమాలపై కూడా జీఎస్టీ వసూలు చేస్తున్న బిజెపిది దేశభక్తి కాదు, దోపిడీదారుల భక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. లెక్కా పత్రం లేని భారీ ప్రాజెక్టులు, ఆరు వరసల రోడ్లు, అడవి గర్భంలో దాగిన ఖనిజ సంపద, ఇసుక క్వారీ, కొండలు, గనులు అన్నింటిని దేశ-విదేశీ కార్పోరేట్లకు దోచిపెడుతూ ఎదిరించిన ప్రజలపై అణిచివేత చర్యలు తీవ్రం చేస్తున్నారు. దండకారణ్య ఆదివాసిలపై యుద్ధం ప్రకటించి దేశ సరిహద్దులను కాపాడాల్సిన మిలటరీ-పారా మిలిటరీ బలగాలను ఆదివాసులను, విప్లవోద్యమాన్ని అణిచివేయడానికి వినియోగిస్తున్నారు. చివరికి దేశ ప్రజలపైనే డ్రోన్స్ తో బాంబుదాడులు చేయడానికి దిగజారారు. సహజ వనరులను దోచుకుంటూ, ఆర్ధిక-రాజకీయ పెత్తనాలకు అవినీతికి పాల్పడుతూనే పర్యావరణ విధ్వంసానికి ఎగబడుతున్నారు. ఆర్ధిక సామాజిక అసమానతలతో ధనిక భారతం- దరిద్ర భారతంలను పెంచి పోషించడమే కాకుండా, కాలుష్యం అకాల వర్షాలు కరువు- కాటకాలను ప్రజలందరికీ బోనస్ గా అందిస్తున్నారు.
అందుకే బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 46 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా క్రోడీకరించి కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాలతో మన వ్యవసాయాన్ని మార్కెట్ శక్తుల పాదాక్రాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు ప్రజా పోరాటాలతో వాటిని రద్దుచేసి ప్రజలకు క్షమాపణ చెప్పింది. 2020- విద్యుత్ బిల్లుతో వ్యవసాయ
మోటార్లకు మీటర్లు బిగించడానికి ఉవ్వీల్లూరుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కారు దన్నుతో మణిపూర్లో జాతుల, మతాల కార్చిచ్చు రగిలించి ఆగని
మారణహోమం మధ్య నూతన ఫారెస్ట్ బిల్లును ఆమోదించి షెడ్యూల్డ్ ప్రాంతాలకు ఉన్న మౌలిక రాజ్యాంగ రక్షణలకే ఎసరు పెడుతుంది. ఎన్.ఈ.పి-2020తో విద్యా వ్యవస్థను కాషాయమయం చేస్తూ, చిన్నతనం నుండి పసిపిల్లల మెదళ్ళలో విష బీజాలు నాటడానికి సిద్ధమైంది. తొమ్మిదేళ్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచి 1200 రూ.ల దాకా గ్యాస్ బండ ధర పెంచి ఎన్నికల సమయంలో 500రూ. లకే అంటూ బహిరంగ ఆత్మ వంచన, పరవంచనకు పాల్పడుతుంది. ఇక సి.ఎ.ఎ అంటూ ప్రారంభించిన మత రాజకీయాలతో హిందుత్వను ఆమోదించిన వారే దేశంలో ఉండాలని సంఘపరివార్ ఎజండా అమలుకు సిద్ధమవుతుంది. గోవింద్ పన్సారే, దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేష్ లాంటి సెక్యులర్ ప్రజాస్వామిక వాదుల హత్యలు, అర్బన్ నక్సలైట్ల పేరిట ప్రశ్నించేవారిని బంధించడం సర్వసాధారణంగా మారింది. జైళ్లో ఫాదర్ స్టాన్ స్వామి మరణానికి కారణమైంది. నల్లచట్టాలను రద్దు చేయాలన్న దేశ ప్రజల డిమాండ్లను పెడచెవిన పెట్టి లా కమీషన్ సిఫార్సుల పేరిట 124 (A) దేశద్రోహ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ, రాజ్యాంగ సవరణ అంటూ ఊరేగుతున్నది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే బూర్జువా ప్రజాస్వామ్యం- బూర్జువా నియంతృత్వం రెండూ ఒకే నాణానికి ఉన్న బొమ్మా బొరుసులని స్పష్టమవుతున్నది. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు ఎంచుకోవడానికి ఏమీ లేదని భూస్వామ్య వ్యతిరేక ప్రజాస్వామిక విప్లవాన్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తియుత విప్లవాన్ని నిర్మించడమే నిజమైన ప్రత్యామ్నాయమని ప్రజలకు పిలుపునిస్తున్నాం.
ఇక ఎన్నికలు జరుగుతున్న మరొక రాష్ట్రం తెలంగాణలో, చారిత్రిక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి తొలి- మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల దాకా అనన్య త్యాగాలతో ప్రజల్లో నిజమైన ప్రజాస్వామిక ఆకాంక్షలు ఏర్పడ్డాయి. వీటికి అనుగుణంగా నక్సల్ ఎజెండానే తమ ఎజెండాగా ప్రకటించి, తెలంగాణ సెంటిమెంటుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ బిఆర్ఎస్ గా అవతారం ఎత్తింది. చాలాకాలం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలికినా, హిందుత్వ విధానాలకు వ్యతిరేకమంటూ మధ్యలో దోబూచులాడింది. నక్సల్స్ ఉద్యమం లేదంటూనే ప్రొఫెసర్లను, తెలంగాణ ప్రజా ఉద్యమ కళాకారులను వదలకుండా దేశంలోనే అత్యధిక మందిపై ఉపా కేసులు నమోదు చేసింది. ప్రజాందోళనలపై, సభలపై సమావేశాల పై ఉక్కు పాదం మోపింది. అవినీతి ఆరోపణలలో నీటి ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. మద్యం ఏరులై పారుతుండగా తాగి ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరగడం, దేశంలోనే విద్యారంగ బడ్జెట్ కేటాయింపుల్లో అత్యల్ప బడ్జెట్ ఉండడం, పేపర్ల లీకేజీలు, ఉద్యోగాల భర్తీలో అలసత్వం తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు ఆశనిపాతంగా తయారైంది. భూమి సమస్యకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణాలో ప్రభుత్వ, పరంపోగు, బంజరాయి, శిఖం, వక్స్, అసైండ్ మొదలగు న్యాయంగా ప్రజలకు చెందాల్సిన భూములు రాజకీయ నేతలు, పెత్తందార్లు, భూస్వాములు, మాఫియాల దురాక్రమణలకు గురవుతున్నాయి. వాటికి ధరణి పోర్టల్ పట్టా లైసెన్సు ఇచ్చే, భూ సంస్కరణలు పాతరేసే పక్క సాధనంగా పాలక వర్గాల చేతుల్లో ఆయుధంగా తయారయ్యింది.
నీటి రాశులు పెరుగుతున్న రాష్ట్రంలో భూమి రియల్ ఎస్టేట్ సరుకు అవుతుండడం, సంపద పెరిగిన రాష్ట్రంలో అప్పులు 5 లక్షల కోట్లకు చేరడం ఆందోళన కలిగించే పరిణామం. గత ఉమ్మడి పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించడం పాలనను ప్రజల చెంతకు తేవడం కాదు కదా. వ్యవసాయాన్ని ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ను పెంచడం కోసం, హింసాయుత పోలీస్ యంత్రాంగాన్ని ప్రజల నెత్తిన మోపడం కోసమే. అభివృద్ధి-సంక్షేమం రెండు కండ్లుగా సాగుతున్నాయని పాలకులు ప్రకటిస్తుంటే, భూములమ్మి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఎల్లెడలా ప్రశ్నలుత్పన్నమవుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్య తెలంగాణ దిశగా ప్రజలు పోరాడకుండా రాష్ట్రంలోనూ మౌలిక మార్పులు సాధించలేము. అందుకే పాలక పార్టీలు, పాలక ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని వంచించే శుష్క వాగ్దానాలతో ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్న స్థితిలో ఎన్నికలు ప్రహసనంగా మారిపోయినాయి.
అందుకే ఒకచోట కాకుండా మరొకచోట, ఇప్పుడు కాకుంటే మరొకప్పుడు పాలకపక్షాలన్నీ అధికారం వెలగబెట్టినవే. అందుకే ప్రజలకు ప్రజా యుద్ధం మార్గం ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయాలెంచుకొని సాగడం తప్ప మరొక మార్గం లేదని ప్రకటిస్తున్నాం. ఇదే నిజమైన ప్రజా రాజ్యాధికార స్థాపనకు ఏకైక మార్గం. కావున బూర్జువా ఎన్నికలను బహిస్కరిస్తూ ఓట్లడగడానికి వస్తున్న పాలకవర్గ పార్టీలను నిలదీయాలని మరోసారి ప్రజలకు పిలుపునిస్తున్నాం.
నవంబర్, 2023
విప్లవాభినందనలతో
గంగాధర్
అధికార ప్రతినిధి
సి.పి.ఐ (ఎం.ఎల్) జనశక్తి, కేంద్రకమిటి