దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. కమిటీ అధ్యక్షుని తీరుపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘ సభ్యులు పట్టు వీడకుండా తమ పంథాను కొనసాగిస్తున్నారు. పక్షం రోజుల్లో జనరల్ బాడీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంత వరకూ స్పందించకపోవడం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కమిటీ అధ్యక్షుని తీరుపై ప్రత్యేకంగా సమావేశం అయిన సంఘం ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. గత ఫిబ్రవరి 15న జరిగిన సమావేశంలోనే కమిటీ చేసిన వృధా ఖర్చులతో పాటు ఇతరాత్ర అంశాలపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరిగింది. తాజాగా అధ్యక్షుని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు డెడ్ లైన్ విధించడం సంచలనంగా మారింది. గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ అధ్యక్షునికి సభ్యులు డెడ్ లైన్ విధించారు. పదిహేను రోజుల క్రితం జరిగిన సమావేశంలో వివరించిన విధంగా నడుచుకోవడం లేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం కరీంనగర్ గ్రానైట్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడి తీరును తప్పు పడుతూ చర్చించడంతో పాటు నాలుగు ఐదు రోజుల్లో స్పందించాలని కూడా సూచించారు. ఈ మేరకు అధ్యక్షునికి సభ్యునికి లేఖ కూడా రాస్తూ… జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు తేదితో పాటు కొత్త కమిటీ ఏర్పాటు అంశం గురించి ప్రస్తావించారు. ఫిబ్రవరి 15న జరిగిన సమావేశంలో 15 రోజుల్లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని, అయితే 20 రోజులు గడిచినా మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని ఆ లేఖలో వివరించారు. ఫోన్ లో అందుబాటులో ఉండకపోవడంతో పాటు తాము ఫోన్ చేస్తే కూడా స్పందించడం లేదని, వాట్సప్ ద్వారా కూడా రిప్లై ఇవ్వడం లేదని ఆ లేఖలో ప్రస్తావించారు. అసోసియేషన్ గ్రూపులో చర్చించే అవకాశం కూడా లేకుండా చేయడం సరికాదంటూ ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖ ద్వారా పంపుతున్న అంశాలపై నాలుగు ఐదు రోజుల్లో సమాధానం చెప్పాలని గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ డిమాండ్ చేసింది.