ఎనిమిదేళ్ల పోరాటం… లక్ష్యం కోసం పోటీకి సిద్దం…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

ఎనిమిదేళ్ల క్రితం థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బాధితులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో వివరించాలని నిర్ణయించుకున్నారు. తమపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లకు చెందిన కోల హరీష్ సంచలన ప్రకటన చేశారు. ఇంతకాలం తాము చేస్తున్న పోరాటాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన కరీంనగర్ ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని విధాలుగా తమను ఆదుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికి అధికారంలోకి వచ్చిన తరువాత తమ విషయాన్ని విస్మరించారని కోల హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరించిన అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి, ఎస్సై రవిందర్ తో పాటు 30 మంది కానిస్టేబుళ్లపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా వారికి పదోన్నతులు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోల హరీష్ ఆరోపించారు. తమపై జరిపిన థర్డ్ డిగ్రీ ఘటనపై విచారణ జరపాలని ఎనిమిది సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని, తమ డిమాండ్ వినిపించాలంటే లోకసభ ఎన్నికలే అసలైన వేదికగా భావిస్తున్నాని హరీష్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఈ అంశం మరోమారు చర్చకు రావడంతో పాటు న్యాయం జరుగుతుందన్న ఆశతోనే తామీ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నట్టయితే పోటీ చేసే విషయంలో పునరాలోచిస్తామని, లేటనట్టయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి తమ గళాన్ని వినిపిస్తామని హరీష్ ప్రకటించారు.

You cannot copy content of this page