తప్పేవరిది పనిష్మెంట్ ఎవరికీ..? సింగరేణి యాజమాన్యం తీరుపై విమర్శలు

దిశ దశ, గోదావరిఖని:

గాయం ఒకచోట అయితే మందు మరోచోట రాసినట్టుగా సింగరేణి యాజమాన్యం తీరు ఉందంటున్నాయి కార్మిక సంఘాలు. శాస్త్రీయంగా చేపట్టాల్సిన బొగ్గు సేకరణ విషయంలో వైఫల్యాలను అన్వేషించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా కార్మికుల జీవితాలను ఫణంగా పెట్టే ప్రయత్నం సాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బొగ్గు ఉత్పత్తిలో భాగంగా జరిగే గని ప్రమాదాల విషయంలో కూడా చివరకు గని కార్మికులే బలవుతున్నారు. సింగరేణి సంస్థలో అత్యంత కీలక భూమిక పోషించే కార్మికులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి బొగ్గు సేకరణలో నిమగ్నం అవుతుంటే ప్రమాదాల విషయలో యాజమాన్యం ఎత్తుకున్న సరికొత్త పల్లవి అందరినీ విస్మయపరుస్తోంది.

సంస్థ నిర్ణయం ఇది…

సింగరేణి లో కార్మికులకు ఎల్లో, రెడ్ వార్నింగ్ కార్డులు ఇవ్వాలని సంస్థ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన సర్క్యూలర్ జారీ అయింది. ఈ లేఖలో ఉన్న సారాంశం ప్రకారం… సింగరేణి రక్షణ విభాగంలో పని చేసే కార్మికులు ఒకసారి తప్పు చేస్తే ఎల్లో(పసుపు )కార్డు, మూడు సార్లు వరసగా తప్పు చేస్తే రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ కార్డుల ఆధారంగా కార్మికులపై యాజమాన్యం క్రమ శిక్షణ చర్యలు తీసుకోనుంది. ఈ నిర్ణయం మేరకు గని ప్రమాదాలు సంభవించిన తరువాత అక్కడ డ్యూటీలో ఉన్న కార్మికుల ఉద్యోగాలకు భరోసా లేకుండా పోతోంది. సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై అన్ని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా నిర్ణయం తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే కోల్ ఆఫ్ డిసిప్లేన్ నిర్ణయంతో కార్మికులు భావ స్వేచ్ఛను వ్యక్తికరించే అవకాశం లేకపోగా తాజాగా విడుదలైన సర్క్యూలర్ తో కార్మికులు తమ ప్రాణాలను కాపాడుకోవడాని కన్నా ముందు ఉద్యోగాన్ని కాపాడుకోవల్సిన దుస్థితి ఏర్పడింది.

కారకులెవరూ..?

సింగరేణి సంస్థ భూగర్భ గనిలో బొగ్గు సేకరణ విషయంలో సేఫ్టీ విభాగం నిర్ణయించిన తరువాతే కార్మికులు గనిలోకి వెల్తారు. ఓర్ మెన్స్, సర్దార్లు ముందుగా మైన్ ను పరిశీలించిన తరువాత కార్మికులు విధుల్లో చేరడం ఆనవాయితి. అంతకాకుండా సింగరేణి సంస్థ ఎక్కడైతే బొగ్గు సేకరించాలని భావిస్తుందో ఆ ప్రాంతంలో మైనింగ్ నిపుణులు, ఇతరులు అంతా కూడా పరీక్షలు చేసిన తరువాత తవ్వకాలు ప్రారంభం అవుతాయి. బ్యాడ్ రూఫ్ విషయంలో అయినా, బొగ్గు తవ్వే ప్రాంతాలకు అవతల నీటి ప్రవాహాలు ఉన్నా కూడా వాటిని ముందుగా గుర్తించాల్సింది సింగరేణి సంస్థలోని నిపుణులు, సేఫ్టీ వింగ్ యంత్రాంగం. బ్లాస్టింగ్ చేసిన తరువాత ఎమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అంతా సవ్యంగానే ఉందా అన్న విషయాన్ని కూడా వీరే నిర్థారించాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలపై సర్టిఫై చేసిన తరువాత బొగ్గును వెలికి తీసేందుకు కార్మికులు గనిలోకి దిగుతారు. అయితే గని ప్రమాదాలు సంభవించినప్పుడు సేఫ్టి వింగ్ పై చర్యలు తీసుకోవల్సి ఉన్నప్పటికీ సింగరేణిలోని సేఫ్టీ వింగే కార్మికులను ఎల్లో కార్డు, రెడ్ కార్డు జారీ చేస్తామంటూ సర్క్యూలర్ జారీ చేయడం విచిత్రంగా ఉంది. నిపుణులు, సేఫ్టి విభాగం పర్యవేక్షణ తరువాత చివరగా బొగ్గును సేకరించే కార్మికులను బలి చేయడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది. గని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కార్మికులను బాధ్యుల్ని చేయడం ఎంతవరకు సమంజసమో సింగరేణి యాజమాన్యానికే తెలియాలని అంటున్నాయి కార్మిక సంఘాలు.

కోల్ ఇండియాలో…

తాజాగా సింగరేణి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో ఎక్కడా కూడా అమలు చేయడం లేదు. కేవలం తెలంగాణాలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేని సంస్థ మాత్రమే ఈ నిర్ణయంతీసుకోవడం గమనార్హం. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడంలో విఫలం అయిన వారిని వదిలేసి సంబంధం లేని కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఏది ఏమైనా సింగరేణి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 

You cannot copy content of this page