కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసు వేసిన వ్యక్తి హత్య

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంచలనంగా మారిన ఈ హత్యకు కారణాలు ఏంటీ అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో నాగవెల్లి రాజలింగ మూర్తిని అగంతకులు కత్తులతో దాడి చేసి చంపారు. ఆయన సతీమణి స్థానిక మునిసిపల్ వార్డు కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వహించారు.

కేసు

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో పిల్లర్ కుంగిపోయినందని… నిర్మాణ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఇంజనీరింగ్ అధికారులతో పాటు పలువురిని బాధ్యులుగా చేయాలని కోరుతూ భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు రాజలింగ మూర్తి. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు పలువురికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే భూపాలపల్లి కోర్టులో విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ స్టే పొడగించే విషయంపై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ఒకరోజు ముందే పిటిషనర్ హత్యకు గురి కావడం గమనార్హం.

ఎవరో..?

అయితే రాజలింగ మూర్తి హత్యకు పక్కా ప్లాన్ చేసుకుని చంపినట్టుగా స్పష్టం అవుతోంది. ఆయన ఏఏ ప్రాంతంలో సంచరిస్తాడు… ఎక్కడ అతన్ని మట్టబెట్టవచ్చు అన్న విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత రెడ్డి కాలనీని ఎంచుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. అతన్ని ఫాలో అయి ఎవరూ లేని చోటు ఎంచుకుని చంపారా? లేక కాపు కాసి చంపారా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. అయితే పోలీసు అధికారులు మాత్రం అనుమానితులను గుర్తించే పనిలో నిమగ్నం అయినట్లు తెలుస్తోంది. సాంకేతికత ఆధారంగా, సీసీ ఫుటేజీ ద్వారా కూడా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హత్యకు కారణమేమిటి అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.


 

 

You cannot copy content of this page