దిశ దశ, కరీంనగర్:
సిరిశాల… సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దశాబ్దాలుగా ఉరిశాలగా మారిన సిరిశాలలో సిరులు వెలుగొందాలని ఆకాంక్షించిన గొంతులెన్నో… స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత సిరిసిల్ల స్థితిగతుల్లో ఊహలకందని మార్పులు చోటు చేసుకుంటాయని కలలు కన్నారంతా. పదకొండేళ్ల స్వరాష్ట్ర పాలనలో సెన్సేషనల్ ఇష్యూస్ కు కేంద్ర బిందువుగా సిరిసిల్ల మారడం గమనార్హం.
ఈ సంచలనాలు సాధారణ ప్రజల ద్వారానో, రాజకీయ నాయకుల కారణంగానో లేక ప్రకృతిలో చోటు చేసుకున్న పరిణామాల వల్లో జరగడం లేదు. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ల కేంద్రీకృతంగా జరుగుతున్నాయి.
ఇసుకతో…
రాజన్న సిరిసిల్ల జిల్లా మీదుగా ప్రవహిస్తున్న నదుల నుండి ఇసుక రవాణా జరుగుతున్నదన్న ఆరోపణలు వినిపించేవి అప్పట్లో. ఇదే సమయంలో జిల్లెల్ల వద్ద ఇసుక లారీల రాకపోకలతో ప్రమాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇసుక లారీ ఢీ కొట్టడంతో చనిపోయాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కోపంతో రగిలిపోయి ఇసుక లారీలను దగ్దం చేశారు. మృతదేహంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నాలు చేశారు. ఇందుకు బాధ్యులు మీరేనంటూ కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్ట్ వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు. అక్కడ అనారోగ్యం బారిన పడిన వీరిని ఆసుపత్రికి తరలించగా ఈ విషయం బయటకు పొక్కింది. అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక అక్రమ రవాణాపై గళం ఎత్తిన దళితులు, బీసీలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్పీ తీరును తప్పు పట్టారు. దీంతో అప్పుడు ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. సిరిసిల్ల అభివృద్ది విషయంలో రాజీ లేకుండా నిధుల వరద పారించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కేటీఆర్ క్రియేట్ చేసిన బ్రాండ్ 70 ఏళ్ల రికార్డులను బ్రేక్ చేసింది. రాజన్న జిల్లాలో జరిగిన అభివృద్దిని చేతల్లో చూపించిన ఘనత దక్కించుకున్న కేటీఆర్ పొలిటికల్ లైఫ్ లో ఇసుక రవాణాకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనకారులపై అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు మాయని మచ్చను మిగిల్చింది. అప్పుడు కేటీఆర్ మెప్పు కోసమో లేక శాంతి భద్రతల పరిరక్షణ కోసమో తెలియదు కానీ వారు నెరేళ్ల బాధితులపై ప్రదర్శించిన అత్యుత్సహ ఫలితం మాత్రం బీఆర్ఎస్ పార్టీని కూడా ఇరకాటంలో పెట్టింది.
ఇప్పుడు…
తాజాగా మరోసారి రాజన్న సిరిసిల్ల వార్తల్లో నిలుస్తోంది. గత కొంత కాలంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో తమ పేర్లను చేర్పించుకున్న వారు ఆ భూములను తిరిగి అప్పగిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారంతా స్వచ్ఛందంగా అప్పగిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనన్న ప్రచారం కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. చాలా వరకూ కేటీఆర్ కు తెలియకుండానే సాగినప్పటికీ అందరి వేళ్లు ఆయన వైపు చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు జిందం చక్రపాణికి సంబంధించిన బార్ సీజ్ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. కేటీఆర్ పేరిట ఏర్పాటు చేసిన టీ స్టాల్ తొలగించిన విషయం సంచలనంగా మారింది. ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే వేములవాడ సమీపంలోని అగ్రహారం వద్ద నిర్వహిస్తున్న విజయ డైరీకి నాలుగు రకాల లైసెన్సులు లేవని సీజ్ చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలెక్టర్ తో మాట్లాడి రైతులు ఆధారపడి ఉన్న డైరీ విషయంలో మినహాయింపు ఇవ్వాలని, సీజ్ తొలగించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలెక్టర్ తో మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇకపోతే కలెక్టర్ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అంశాలు గతంలో నేషనల్ మీడియాలో ప్రసారం అయ్యాయి. ఈ న్యూస్ క్లిప్పింగ్స్ స్థానిక సోషల్ మీడియాలో అబ్బాడి అనీల్ కుమార్ షేర్ చేశారని కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని అబ్బాడి రాజిరెడ్డి అనే రైతును అరెస్ట్ చేశారు. గొంతు సంబంధిత వ్యాధి బారిన పడి సర్జరీ చేయించుకున్న రాజిరెడ్డిని అరెస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. ఇలాంటి కేసుల్లోనే పలువురు రైతులు అరెస్ట్ అవుతున్నారని అంటున్నారు స్థానికులు. ఓ సోషల్ మీడియాలో కలెక్టర్ వ్యక్తిగత విషయాలతో పాటు ఇతరాత్ర అంశాలను పోలుస్తూ కథనం ప్రసారం చేశారన్న ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. అక్రమాల వ్యవహారాలను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నోటీసులు ఇవ్వకుండానే నేరుగా చర్యలు తీసుకుంటున్నారన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం వేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
నష్టం ఎవరికీ..?
చట్టాలకు లోబడే అధికార యంత్రాంగం వ్యవహిరస్తోందన్నది వాస్తవమే అయినప్పటికీ చర్యలు తీసుకుంటున్న తీరే సరిగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిరిసిల్లలో పాగా వేయాలని తపన పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో అదికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేస్తోందని, ఆయనను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తోందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిబంధనల పేరిట సామాన్యులపై యంత్రాంగం తీసుకొస్తున్న ఒత్తిళ్లతో అధికార పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న ఆందోళన ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులలో కూడా వ్యక్తం అవుతోంది.
ట్రేడ్ లైసెన్స్…
అయితే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ అన్న పదమే హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇక్కడ అధికార యంత్రాంగం తమ వేలిని తమ కంట్లోనే పొడుచుకుంటున్నారన్న విషయాన్ని గమనించాలి. మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ అనేది ప్రాధాన్యత క్రమం అయితే ఒక్క సిరిసిల్ల పట్టణం విషయాన్ని పరిశీలిస్తే… కొన్ని వందల వ్యాపారాలు సాగుతున్నాయి. వస్త్ర, మెడికల్, కిరాణం, హోటల్స్, వెజిటేబుల్స్, ట్రావెల్స్, విదేశాలకు పంపించే ఏజెన్సీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా చెప్పుకుంటూ పోతే వందల రకాలా బిజినెస్ నడుస్తోంది. వీటిలో ఎన్ని దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ ఉంది..? ట్రేడ్ లైసెన్స్ తీసుకున్న వారు రెన్యూవల్ చేసుకుంటున్నారా..? వాటి ద్వారా వచ్చే ఆదాయం ఎంత..? జీఎస్టీ లైసెన్స్ తీసుకున్నారా..? ఫైర్ సేఫ్టీ మేజర్స్ తీసుకున్నారా ఇలా చాలా అంశాలతో ముడిపడి ఉన్న అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. కానీ వీటన్నింటిని మెయింటెన్ చేస్తున్నారా లేదా అన్న విషయంలో మునిసిపల్ యంత్రాంగం దృష్టి సారించకపోవడానికి కారణమేంటన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికార యంత్రాంగం నిబంధనలను అమలు చేయడం సరైందే కానీ అన్ని వర్గాలపై కూడా ఇదే విధానాన్ని అవలంభించాల్సి ఉంటుందన్న విషయం గుర్తెరగాలి. మరో వైపున మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారాలు చేస్తున్న వారిపై ఇంతకాలం చూసిచూడనట్టుగా వ్యవహరించిన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ఉంటుంది కదా… వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. దీనివల్ల అబాసుపాలయ్యేది అదికార యంత్రాంగం, అధికారంలో ఉన్న ప్రభుత్వమే తప్ప మరోటి కాదన్న విషయం గమనించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున భూములు ఆక్రమించుకున్నారని రైతులపై కేసులు పెడుతున్నారు. అయితే ఇంతకాలం రెవెన్యూ భూములు కబ్జా చేసిన అంశాన్ని సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శించారు..? వాటిని అన్నింటా కాపాడాల్సిన బాధ్యత ఎందుకు విస్మరించారన్న చర్చ కూడా సాగుతోంది.