DELHI Elections: క్రేజీ రిజల్ట్స్ … కేజ్రీవాల్ సహా ప్రముఖల ఓటమి…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

దేశ రాజధానిని ఏక ఛత్రాధిపత్యంగా ఏలుతున్న చీపురు పార్టీ తుడిచి పెట్టుకపోయే విధంగా ఢీల్లీ ఓటర్లు తీర్పునిచ్చారు. టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ ఆప్ ముఖ్య నేతలు కూడా ఓటమి చవి చూడడం సంచలనంగా మారింది. ఎన్నికల్లో ప్రత్యర్థులకు అవకాశం లేకుండా విజయ బావుటా ఎగురవేసే ఆనవాయితీ వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులకు ఉంటుంది. కానీ న్యూ ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు ఆప్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చారు. చరిత్రలో అత్యంత అరుదైన ఫలితాల్లో ఈ సారి జరిగిన ఢిల్లీ ఎన్నికలు రికార్డు సృష్టించాయి. పార్టీ అధినేతను సైతం ఓడించారంటే ఈ సారి ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.  అధినేత కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంగా పని చేసిన మనిష్ సిసోడియా, మరో ముఖ్య నేత సత్యేంద్ర జైన్ లు పరాజయం చెందడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి  పర్వేష్ వర్మ 3 వేల మెజార్టీతో, సిసోడియాపై తర్వీందర్ సింగ్ 600 ఓట్లతో గెలుపొందారు. ఆప్ కు చెందిన మరి కొందరు ప్రముఖులు కూడా ఓటమి అంచున కొట్టుమిట్టాడుతున్నారని ఇప్పటి వరకు అందిన ఫలితాలను బట్టి స్ఫష్టం అవుతోంది.


ఊరట… 

ఆప్ పార్టీకి సీఎం అతిశీ గెలుపొందడం కొంత ఊరటనిచ్చింది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో అతిశీని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. చివరి మూడు రౌండ్ల వరకు కూడా అతిశీ వెనకంజలోనే ఉండడం గమనార్హం. ఆ మూడు రౌండ్లలో ఆధిక్యం సాధించడంతో అతిశీ గెలుపొందారు. దీంతో ఢిల్లీలో ఆప్ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా మారింది.

‘‘హజారే’’ ఎఫెక్ట్… 

ఆప్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన అన్నా హాజారే ప్రబావం కూడా లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నీతి నిజాయితీ నినాదంతో ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ తిరుగులేని విజయాలతో పట్టు బిగించారు. ఉధ్దండులను కూడా వెనక్కి నెట్టి ఢిల్లీలో తన ప్రత్యేకతను చాటుకుని ఇతర రాష్ట్రాల్లోనే జయ కేతనం ఎగుర వేశారు. అయితే నిబద్దతతను ప్రదర్శించడంలో ఆప్ నేతలు విఫలం అవుతున్న తీరును గమనించిన అన్నా హాజారే వ్యతిరేకించడం కూడా నష్టాన్ని చేకూర్చింది. లిక్కర్ స్కాంతో పాటు పలు రకాల విమర్శలు ఎదుర్కోవడం కూడా ఆప్ పార్టీపై వ్యతిరేకతకు కారణం అయింది. ఏది ఏమైనా దేశ రాజకీయాల్లోనే సంచలనం అరంగ్రేట్రం చేసిన కేజ్రీవాల్ పార్టీ ఓటమి తీరు కూడా సంచలన ఫలితాలను అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

You cannot copy content of this page