ఊపిరిలూదిన జిల్లానే ఊసురుమనిపిస్తోందా..?

గులాభి లీడర్లపై వరుస కేసులు దేనికి సంకేతం..?

దిశ దశ, కరీంనగర్:

ఉద్యమ ప్రస్థానానికి ఊపిరి పోసిన జిల్లా అది. ఉద్యమ నేత కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే జిల్లాగా పదే పదే చెప్పుకున్నారప్పుడు. స్వరాష్ట్ర కల సాకరం కోసం కీలకమైన పోరాటానికి శ్రీకారం చుట్టాలంటే చాలు కరీంనగర్ జిల్లా నుండే ప్రారంభించే వారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన సింహ గర్జన నుండి మొదలు ఆమరణ దీక్షకు వెల్లే వరకూ కూడా కేసీఆర్ తన తొలి అడుగు ఇక్కడి నుండే ఆరంభించే వారు. ఇదే సెంటిమెంట్ తో కరీంనగర్ జిల్లా ప్రజలు స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత కూడా గులాభి పార్టీని అక్కున చేర్చుకున్నారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితులన్ని ఉల్టాపల్టాగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు గులాభి జెండా ఎత్తిన లీడర్లు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఫిర్యాదుల పరంపర…

కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తమను నిండా ముంచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై బాధితులు కంప్లైంట్ చేసేందుకు సీపీ అభిషేక్ మహంతిని ఆశ్రయిస్తున్నారు. దాదాపు 600లకు పైగా భు కబ్జాలు, దందాలకు సంబంధించి ఫిర్యాదులు రాగా అందులో ప్రత్యక్ష్యంగానో పరోక్షంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రమేయం కనిపిస్తూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన వ్యవహరించిన కొంతమంది నాయకుల పుణ్యమా అని ఇప్పుడు అబాసు పాలయ్యే పరిస్థితికి చేరింది. పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టడం ఆరంభించిన తరువాత చాలా మంది లీడర్లు తమ తమ తప్పిదాలపై ఫిర్యాదుల రాకూడదని బాధితుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ జోలికి రాకూడదని మీ ఆస్తులు మీకు అప్పగిస్తామంటూ బుజ్జ గింపులకు దిగుతున్నారు. ఇందు కోసం రాయబారాలు… కాళ్ల బేరాలను కూడా కొనసాగిస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ తోట రాములు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడనని ప్రచారం చేసుకున్న చీటి రామారావులపై కేసు నమోదు చేయడంతో ప్రారంభం అయిన పోలీసుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో కార్పోరేటర్ జంగిలి సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు కార్పోరేటర్ల భర్తలు సుదగోని కృష్ణ, కోల ప్రశాంత్, ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతి రావు, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు కొమ్ము భూమయ్యతో పలువురు అరెస్ట్ అయ్యారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మిడ్ మానేరు నిర్వాసితుల ప్రతినిధి కూస రవిందర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోడల్లుడు, రాజ్య సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవిందర్ రావును ఏ1 నిందితునిగా పేర్కొన్నారు. ఇవే కాకుండా చాలా కేసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్లు) ప్రత్యేకంగా విచారణ చేపట్టాయి. పోలీసుల వద్దకు చేరిన ఫిర్యాదులను విచారించడంతో పాటు ఆధారాలు సేకరించిన తరువాత మరిన్ని క్రిమినల్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

రాష్ట్రం అంత సైలెంట్…

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో దందాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంలో పోలీసు అధికారులు దూకుడు ప్రదర్శించడం లేదు. ఒకటి రెండు జిల్లాల్లో ఒకటి అరా కేసులు నమోదు చేసినప్పటికీ ఆ తరువాత సైలెంట్ అయినట్టుగానే కనిపిస్తోంది. అయితే కరీంనగర్ కమిషనరేట్ లో మాత్రం అక్రమార్కులపై కొరడా ఝులిపించడంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. ఫిర్యాదులను పరిశిలించేందుకు సపరేట్ వ్యవస్థనే ఏర్పాటు చేసిన సీపీ అభిషేక్ మహంతి చట్ట ప్రకరాం బాధితుల పక్షాణ నిలబడాలని స్పష్టం చేస్తున్నారు. ఫిర్యాదులు రాగానే క్రిమినల్ కేసులు నమోదు చేయడం కాకుండా దరఖాస్తులో ఉన్న తీవ్రతను పరిశీలించి వాటిని సంబంధిత విభాగాలకు పంపించే ఏర్పాటు కూడా చేశారు. దీంతో ఒక్కో పిటిషన్ ను పలు విధాలుగా దర్యాప్తు చేసిన తరువాతే కేసులు నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో అధికారం ఉందన్న కారణంగా పోలీసు అధికారులను చెప్పు చేతల్లోకి తీసుకుని ఇష్టారీతిన వ్యవహరించిన తీరుతో క్షోభకు గురైన బాధితుల గోస ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడం గమనార్హం. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీని వేలెత్తి చూపాల్సిన పరిస్థితులు తయారయ్యాయన్నది వాస్తవం. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్ జిల్లాలోనే పార్టీ పరువు రచ్చకెక్కుతుండడం విచిత్రం. కరీంనగర్ లో జరుగుతున్న అక్రమాల తీరు, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాలపై అధిష్టానం దృష్టికి వెల్లినప్పుడే కఠినంగా వ్యవహరిస్తే ఇప్పుడీ పరిస్థితి ఎదురు కాకపోయేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట్లో చూసి చూడనట్టుగా అధిష్టానం పెద్దలు వ్యవహరంచడం, తమ పంచన చేరిన నాయకులు చాలా మంచివారన్న భ్రమల్లోకి వెల్లడంతోనే ఉద్యమాన్ని, ఉద్యమ నేతను అక్కున చేర్చుకున్న ఖిల్లాలోనే పార్టీ ముఖ్య నాయకత్వం తలదించుకునే పరిస్థితికి చేరిందన్న ఆందోళన సగటు కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.

You cannot copy content of this page