ట్యాపింగ్ ముచ్చట ఈడీ ముంగిట… తాజాగా ఫిర్యాదుల పరంపర

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడీ చేతుల్లోకి వెల్లేందుకు మార్గం సుగమం అవుతోందా..? దర్యాప్తు అధికారుల విచారణలో వెల్లడవుతున్న విషయాలను రూడీ చేసుకునే పనిలో ఉన్న ఈడీకి ఫిర్యాదులు కూడా కలిసొచ్చేవిధంగా ఉన్నాయా అంటే అవుననే అనిపిస్తున్నాయి. తాజాగా మరో న్యాయవాది కూడా ఈడీకి ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి రావడంతో నిందితుల మెడకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఉచ్చు బిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఫిర్యాదులు…

సిట్టింగ్ ఎమ్మెల్సీ, మెదక్ బీఆర్ఎస్ అబ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి, అడ్వకేట్ ఎం రఘునందన్ రావు మూడు రోజుల క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెల్లాపూర్ లోని వెంకటరామిరెడ్డి నివాసం రాజపుష్ప నుండి కోట్ల రూపాయలు ఎన్నికల కోసం తరలించారని, వీటిని పోలీసు వాహానాల్లోనే తరలించారని రఘునందన్ రావు అన్నారు. ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ ఆధారంగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై ఈడీ విచారణ జరపాలని కోరారు. అక్కడి నుండి తీసుకెళ్లిన డబ్బు ఓటర్లకు పంపిపెట్టామని కూడా రాధాకిషన్ రావు చెప్పినందున వెంకట్రామిరెడ్డిపై మనీల్యాండరింగ్ కేసు నమోదు చేయాలని కోరామని రఘునందన్ రావు వెల్లడించారు. మరో వైపున హైకోర్టు అడ్వకేట్ సురేష్ కూడా ఈ ఘటనపై ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఓ పార్టీ డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించారని నిందితులు ఒప్పుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసులో అసలు నిందితులను విచారించలేదని, ఈడీ ఎంటర్ అయి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక ఉన్న రాజకీయ నాయకులు కూడా బయటకు వస్తారన్నారు. ఈ ఫిర్యాదులకు తోడు ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా హవాల రూపంలో డబ్బులు తరలించారన్న విషయాన్ని రాబట్టేందుకు ఈడీ జోక్యం చేసుకునే అవకాశాలయితే స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. మరో వైపున ఫోన్ ట్యాపింగ్ డివైజ్ కొనుగోలు చేయడం, విదేశాల నుండి దిగుమతి చేసుకోవడంతో పాటు ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి అన్న విషయంపై కూడా స్పష్టత వచ్చినట్టయితే ఈ అంశంపై మరింత సీరియస్ గా దృష్టి సారించనుంది. అయితే పంజాగుట్ట పోలీసులు చేస్తున్న దర్యాప్తులో క్రిమినల్ అంశాలకు సంబంధించిన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈడీ ఏ క్షణంలో అయినా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ అయితే సాగుతోంది. ఈడీ ఎంట్రీ అయితే మాత్రం తాము మరింత ఝటిలమైన సమస్యల్లో ఇరుక్కోకతప్పదన్న భయం కూడా వెంటాడుతోంది కొందరిని.

గత అనుభవాలు…

గతంలో తెలంగాణలో నమోదయిన పలు కేసుల్లో కూడా ఈడీ జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసు తెలంగాణలో సద్దుమణిగిందని భావించినప్పటికీ ఇందుకోసం వెచ్చించిన లావాదేవీల అంశంపై ఈడీ నజర్ వేసింది. ఈ కేసుతో లింక్ ఉందన్న కారణంతో పలువురిని పిలిపించి విచారించిన సంగతి తెలిసిందే. అలాగే పార్ట్ టైం ఉద్యోగల పేరిట రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసిన కేసుకు సంబంధించి కేసు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈడీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో పాటు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. మరిన్ని కోసులను తెలంగాణ పోలీసులు నమోదు చేస్తే వాటిలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయన్న కారాణంతో ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవే కారణాలతో ఈడీ జోక్యం చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా డొంక బయటకు తీసేందుకు సన్నద్దం కావడం ఖాయమేనని స్ఫష్టం అవుతోంది.

You cannot copy content of this page