అటు మాసోత్సవాలు… ఇటు ఎదురు కాల్పులు…

దండకారణ్యంలో ఆగని ఎన్ కౌంటర్లు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ ద్విదశాబ్ది ఆవిర్బావాన్ని పురస్కరించుకుని ఈ సారి నెల రోజుల పాటు వేడుకలు జరపాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఏరివేతే లక్ష్యంగా పారా మిలటరీ బలగాలు, స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బలగాలు నక్సల్స ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు జరగనున్న ఆవిర్బావ మాసోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టు కార్యకలపాలు ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు బలగాలు దండకారణ్య అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

వరస ఎన్ కౌంటర్లు…

అయితే మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్యంలో పోలీసు బలగాలు నిరతంరంగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. అభూజామడ్ అటవీ ప్రాంతంలోని నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో DKSZC పశ్చిమ ఇంఛార్జి బాధ్యతల్లో కొనసాగుతున్న 10వ నంబర్ కంపెనీ కమాండర్ రూపేష్, మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కు చెందిన డీవీసీఎం జగదీష్ తో పాటు మరో మహిళా నక్సల్ మృతి చెందారు. ఈ ప్రాంతంలో దాదాపు 24 గంటల వరకు కూడా మావోయిస్టులకు, పోలీసులకు మధ్య పలుమార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఘటనా స్థలం నుండి 1 AK 47, 1 SLR, 12 బోన్ గన్ తో పాటు మావోయిస్టులు వినియోగించే ఇతరాత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

చింతవాగు అడవుల్లో…

మరోవైపున సోమవారం రాత్రి మరో ప్రాంతంలో కూడా ఎదురు కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా చింతల్నార్ స్టేషన్ పరిధిలోని కర్కన్ గూడ అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, 206 కోబ్రా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. చింతవాగు సమీపంలోని గుట్టల్లో జాగర్గుండ ఏరియా కమిటీ, పీఎల్జీఏ బెటాలియన్ కదలికలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న వెంటనే బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ క్రమంలో మావోయస్టులకు, బలగాలకు మధ్య పలుమార్లు ఎదురు కాల్పులు జరిగాయి. అయితే చింతవాగులో వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో బలగాలు ఘటనా స్థలానికి చేరుకునే సరికే మావోయిస్టులు అక్కడి నుండి వెల్లిపోయారని, ఈ ఎదురుకాల్పుల్లో చనిపోయిన ఇద్దరు నక్సల్స్ ను కూడా తీసుకెళ్లారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మావోయిస్టులకు సంబంధించిన మెటిరియల్ పెద్ద ఎత్తున లభ్యం అయిందని వివరించారు.

You cannot copy content of this page