సెంటిల్ మెంట్ గ్యాంగులు… సెంటర్లో అడ్డాలు…

దిశ దశ, కరీంనగర్:

ఓ వైపున సివిల్ కేసుల్లో… క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నా… కరీంనగర్ లో సెటిల్ మెంట్ గ్యాంగుల ఆగడాలు యథావిధిగానే ఎందుకు కొనసాగుతున్నాయ్..? భూ దందాల్లో తల దూర్చితే తమకేమి కాదన్న ధీమాతో సెటిల్ మెంట్ గ్యాంగులు ఎలా జోక్యం చేసుకుంటున్నాయి..? ఇందులో చట్టాలకు పనిచెప్పాల్సిన పోలీసు విభాగానికి చెందిన వారి ప్రమేయం ఉందా..? లేనట్టయితే ఇంత స్వేచ్ఛగా దందాలు ఎలా కొనసాగిస్తున్నారన్నదే మిస్టరీగా మారిపోయింది.

ప్రశాంత్ రెడ్డి హత్యతో…

మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి అనే రౌడీ షీటర్ ను మే 28న ఊటూరు గ్రామంలో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరునాడు ప్రశాంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి చెరువులో శవమై తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ ఘటనను పరిశీలిస్తే ఎన్నెన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశాంత్ రెడ్డిని హత్య చేయడానికి ప్రధాన కారణం భూ దందాయేనని ప్రాథమిక నిర్దారణ జరిగినట్టుగా తెలుస్తోంది. హత్యకు 15 రోజుల ముందు నుండి సాగుతున్న భూ దందా విషయంలోనే నిందితులు ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేశారని భావిస్తున్నారు. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సెటిల్ మెంట్ గ్యాంగులు తమ పనిని యథావిధిగానే కొనసాగిస్తున్నాయని స్పష్టం అవుతోంది. భూ దందాల్లో జోక్యం చేసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తూ తమకు తోచిన విధంగా బాధితులు, కబ్జాదారుల పక్షాన వీరు భాగస్వాములు అవుతున్నట్టుగా తేలిపోయింది. భూ దందాలకు సంబంధించిన అంశాల్లో ప్రైవేటు వ్యక్తులు ఎందుకు ఇన్ వాల్వ్ కావల్సి వస్తోందన్నదే మిస్టరీగా మారింది. ప్రశాంత్ రెడ్డి కానీ నిందితులకు కానీ సంబంధం లేని భూమి పంచాయితీ విషయంలో వీరు చంపుకునేంత స్థాయికి చేరుకోవడమన్నదే విచిత్రంగా మారింది.

అడ్డాలుగా మార్చుకుని…

ప్రశాంత్ రెడ్డి హత్య తరువాత వెలుగులోకి వస్తున్న విషయాలను పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తున్నాయి. సెటిల్ మెంట్ల కోసం సపరేట్ గా అడ్డాలు ఏర్పాటు చేసుకుని వీరు తమ దందాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. కరీంనగర్ కోర్టు సమీపంలోని ఓ కాంప్లెక్స్ లో తరుచూ మీటింగులు ఏర్పాటు చేసుకుని ‘‘భాయ్’’ వాట్సప్ ఆదేశాలతో పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. ఈ అడ్డాలోకి పోలీసు యంత్రాంగానికి చెందిన ఒకరిద్దరు వెల్తుండేవారని కూడా కరీంనగర్ సమాజం అంతా కోడై కూస్తోంది. స్టేషన్ కు వెల్లి బాధితులు ఫిర్యాదు చేస్తే సివిల్ మ్యాటర్ కోర్టులకు వెల్లండి అని చెప్పాల్సిన పోలీసులు కూడా సెటిల్ మెంట్ గ్యాంగులతో మిలాఖత్ కావడం వెనక ఆంతర్యం ఏంటన్నది అంతుచిక్కకుండా పొతోంది. ఈ అడ్డాలోకి వైద్య వ్యాపారంలోఉన్న వారు కూడా వెల్లే వారని ప్రశాంత్ రెడ్డి హత్య తరువాత వెలుగులోకి వస్తోంది. ప్రముఖులు కూడా ఈ అడ్డా కేంద్రంగా సెటిల్ మెంట్లు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ తో పాటు రేకుర్తి, కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా సెటిల్ మెంట్లకు అడ్డాలను ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రౌడీషీటర్లంతా ఒక చోటకు చేరి కొంతమంది యువకులను చేరదీసి వారి జల్సాలకు డబ్బులు ఇచ్చి విలువైన భూముల పరిష్కారం చేసుకుంటున్నట్టుగా సమాచారం.

పోలీసులకు చిక్కకుండా…

అయితే ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో మరో కోణం కూడా వెలుగులోకి వస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుల కోసం పోలీసు అధికారులు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపాయి. అనుమానితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు సాంకేతిక సహకారం అందిపుచ్చుకుంటారని ముందే భావించిన నిందితులు మొబైల్ ఫోన్ ను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. మొదట కిడ్నాప్ జరిగిందని తెలియగానే ప్రశాంత్ రెడ్డిని సేఫ్ చేయాలన్న లక్ష్యంగా పోలీసు బృందాలు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే మరునాటి సాయంత్రం వరకు అతని మృదేహం లభ్యం కావడంతో మరిన్ని టీమ్స్ నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టవర్ లోకేషన్ ఆధారంగా తమను పట్టుకునే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన నిందితులు పోలీసుల కళ్లుగప్పేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ వినియోగించినా తిరిగి అదే మొబైల్ ను వాడకుండా… సిమ్ కార్డును వినియోగించకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసు బృందాలు అటు సాంకేతికతతో పాటు ఇటు సమాచార వ్యవస్థను కూడా పటిష్టం చేసుకుని నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే క్రిమినల్స్ ను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారన్న విషయంపై అనుమానితులు పూర్తి స్థాయిలో పట్టు నిలుపుకున్న తీరే విస్మయానికి గురి చేస్తోంది. వెంటనే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎలా వ్యవహరించాలి అన్న విషయంపై సంపూర్ణ అవగాహన చేసుకుని తప్పించుకున్నారంటే వీరు ఏ స్థాయిలో స్కెచ్ వేశారో అర్థం చేసుకోవచ్చు.

You cannot copy content of this page