కరీంనగర్ లో మాఫియా రాజ్యం నడిచిందా..? బౌన్సర్ల సెక్యూరిటీలో సెటిల్ మెంట్ దందా సాగిందా..?

దిశ దశ, కరీంనగర్:

అధికారంలో ఉన్న కీలక నేతల అండదండలతో కరీంనగర్ లో మాఫియా రాజ్యం సాగిందా..? ఏకంగా బౌన్సర్ల సెక్యూరిటీ నడుమ సెటిల్ మెంట్ల దందా సాగిందా..? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతికి వచ్చి చేరుతున్న దరఖాస్తుల తీరు పరిశీలిస్తే కమిషనరేట్ పరిధిలో జరిగిన అక్రమాలు తీరు సాక్షాత్కరిస్తోంది. సామాన్యుడి నుండి మొదలు అధికార పార్టీతో సంబంధం లేని వారంతా కూడా బలి పశువులే అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.

కేంద్ర బిందువుగా…

గత ప్రభుత్వంలో పోలీస్, పొలిటికల్ లీడర్ల అండదండలతో లాబియింగ్ చేసిన వారిలో ఒకరు ఏకంగా బౌన్సర్ల సెక్యూరిటీ నడుమ సెటిల్ మెంట్ ఆఫీసే తెరిచినట్టుగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి అండదండలతో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదని బీఆర్ఎస్ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, సెటిల్ మెంట్లు, పోలీసుల పోస్టింగులు ఇలా అన్నింటా ఆయన అజమాయిషీలోనే జరిగాయన్నది కరీంనగర్ జిల్లాలో బహిరంగ రహస్యం. కరీంనగర్ లో ‘కీ’ రోల్ పాత్ర పోషించిన సదరు వ్యక్తి కనుసన్నల్లో సాగించిన తీరు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటున్నారంటే అధికారం ఆయన ముందు ఏ స్థాయిలో మోకరిల్లిందో అర్థం చేసుకోవచ్చని కరీంనగర్ కు చెందిన ఓ సీనియర్ నాయకుడు కామెంట్ చేశారు. శివారు ప్రాంత భూములే అయినా, నగరం నడిబొడ్డున విలువైన ఆస్తులే అయినా ఆయన జోక్యం లేకుంటే సెటిల్ కావద్దన్న హుకూం జారీ అయ్యేదని కూడా తెలుస్తోంది. దీంతో బాధితులే అయినా నిందితులే అయినా ఆయన ప్రాపకం కోసం పాకులాడడమే తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది నాడు. ఠాణా మెట్లెక్కిన ఫిర్యాదు కాపితో ఎఫ్ఐఆర్ జారీ చేయాలన్నా… చెత్త బుట్టలోకి చేరాలన్నా ఆయన కనుసైగల కోసం అవి ఎదురు చూసే పరిస్థితి ఉండేదట. రాజ్యంలో ఉన్న పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడమే కాకుండా పోస్టింగుల్లోనూ ఆయన గారి క్లియరెన్స్ లేకుంటే ఆర్డర్లు బయటకు వచ్చే పరిస్థితి లేదు నాడు. దీంతో అధికారి అయినా… అనామకుడు అయినా… ఆయన చుట్టు ప్రదక్షిణలు చేయాల్సిందే. ఆయన చెప్పాడంటే చాలు తప్పుడు ఫిర్యాదు అయినా నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు కావల్సిందేనన్న రీతిలో చెలాయించిన తీరుపై ఒకప్పటి పోలీసు అధికారులు నెత్తి నోరు బాదుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. చివరకు ఆయన గారింట్లో చిన్నా చితకా వేడుక జరిగినా యూనిఫాం అంతా అక్కడే క్యూ కట్టాల్సిన పరిస్థితులు తయారయ్యాయట. ఒకప్పుడు గడగడలాడించిన కరీంనగర్ ఖాకీలు  గత ప్రభుత్వంలో మాత్రం గజగజ వణకుకుంటూ కాలం వెల్లదీశారన్నది ఓపెన్ సీక్రెట్.

అంతా గుప్పిట…

కరీంనగర్ అంతా తన గుప్పిట పెట్టకున్న సదరు ప్రబుద్దుడు ఇక తానేం చేసినా చెల్లుతుందన్న రీతిలో వ్యవహిరంచారన్న విమర్శలూ ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఐపీసీ, సీఆర్పీసీలకు పని లేకుండా… ఆయన అమలు చేసిందే చట్టం అన్నరీతిలో వ్యవహరించారన్న అపవాదును పోలీసు వ్యవస్థ మూటగట్టుకుంది. అసలు పెద్దాయన ఆదేశాలు అలాగే ఉండడం, సర్కారు కూడా రాజ్యంగ విరుద్దంగా పొలిటికల్ పోస్టింగులకు ప్రయారిటీ ఇవ్వడంతో పోలీసు అధికారులు కూడా పరిస్థితులకు అనుగుణంగా మారక తప్పలేదన్న వాదనలు కూడా లేక పోలేదు. దీంతో ఆయన గారు నగరం నడిబొడ్డున ఓ ఆఫీసు ఏర్పాటు చేసుకుని సెటిల్ మెంట్లకు కూడా తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి.  బౌన్సలర్లను పెట్టుకుని మరీ ఒక్కొక్కరిని తన ఆఫీసుకు పిలిచి సెటిల్ మెంట్లు చేశారన్న ప్రచారం జరుగుతోంది. భూ విషయాలకు సంబంధించిన అంశాలకు అడ్డాగా మార్చుకున్న ఆ కార్యాలయానికి చేరుకున్న తరువాత ఆయనకు తోచిన రీతిలో చెప్పిందే న్యాయం అన్నట్టుగా తయారైయ్యాయట నాటి పరిస్థితులు. ఆసుపత్రులు పెట్టుకున్న డాక్టర్లు మధ్య భాగస్వామ్య గొడవలు కూడా ఆయన గారి ప్రమేయం లేకుండా సెటిల్ కాలేదంటే కరీంనగర్ లో ఆయన కేంద్రీకృతంగా సాగించినీ తీరు ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.

You cannot copy content of this page