ఇంట గెలిచిన గడ్డం వంశీ కృష్ణ
దిశ దశ, పెద్దపల్లి:
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడితో పాటు నడుచుకుంటోంది గడ్డం ఫ్యామిలీ. లోకసభ ఎన్నికల్లో తన తనయుడి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వివేకానంద ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించిన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపై వచ్చింది.
చర్చోప చర్చలు…
పెద్దపల్లి పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఇంఛార్జీలతో పాటు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ విషయంలో వ్యతిరేకించారు. చెన్నూరు ఎమ్మెల్యే, వంశీ తండ్రి వివేకానందకు ఆయా సెగ్మెంట్ల నాయకులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడంతో మెజార్టీ ఇంఛార్జీల నుండి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో వంశీ కృష్ణను కాదని మరో అభ్యర్ధిని బరిలో నిలపాలన్న ప్రతిపాదనలు కూడా చేసినప్పటికీ అధిష్టానం మాత్రం వంశీ వైపే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఏడు సెగ్మెంట్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో వివేక్ సమాలోచనలు జరిపే పనిలో నిమగ్నం అయ్యారు. నిన్న మొన్నటి వరకు ఇంఛార్జీల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో వారిని సముదాయించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక పాత్ర పోషించినట్టుగా సమాచారం. వివేకానంద, వంశీకృష్ణలతో ఏడు సెగ్మెంట్ల ఇంఛార్జీలతో ‘‘సయోధ్య’’ కుదిర్చే బాధ్యతలు ప్రేమ సాగర్ రావు వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్ లోని ప్రేమ్ సాగర్ రావు ఇంటి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పెద్దపల్లి ఎంపీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు. వంశీ కృష్ణ గెలుపునకు తామంతా కలిసి పనిచేస్తామంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మిగతా నేతలు కూడా ప్రకటించారు. దీంతో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఏకతాటిపైకి వచ్చినట్టయింది.
తొలి అడుగులోనే…
గడ్డం వంశీ కృష్ణ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రయత్నంలోనే సక్సెక్ కావాలన్న తలంపుతో వివేకానంద పావులు కదిపినట్టుగా సమాచారం. తన తండ్రి వెంకటస్వామి సొంత నియోజకవర్గం కావడంతో పాటు ఇక్కడి నుండి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకులు గడ్డం కుటుంబానికన్నా ఎక్కువ బలం.. బలగం లేకపోవడం కూడా ఆయన ప్రయత్నాలకు కలిసొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం వంశీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ స్థానిక నాయకత్వం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఆయన ఆశలకు గండిపడేసినట్టయింది. ముందుగా అసమ్మతి నేతలను అస్మదీయులుగా మార్చుకోవాలని భావించిన వివేక్ కొద్ది రోజులుగా అంతర్గత చర్చలు జరిపి ఎట్టకేలకు సక్సెయ్ అయ్యారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు కూడా వంశీ కృష్ణ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఏడు సెగ్మెంట్ల నాయకులంతా కూడా నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అటు అభ్యర్థిత్వం ఖరారు… ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతల సమన్వయంలో సక్సెస్ కావడం గడ్డం ఫ్యామిలీ ప్రధాన సమస్యలను అధిగమించినట్టయింది.