శాంతయ్యతోనే ఈ అశాంతి…

మంచిర్యాల సజీవ దహనం ఘటన

విచారణలో వెలుగులోకి…

మంచిర్యాల జిల్లాలో ఆరుగురి సజీవ దహనం కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో 16 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. వివాహేతర బంధం కారణంగానే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించినట్టు సమాచారం. అయితే ఏక కాలంలో ఆరుగురిని హత్య చేసేందుకు ఎందుకు ప్లాన్ చేశారోనన్న కోణంలోనూ పోలీసులు విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఇంటికి నిప్పంటించే ముందు అందులో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారని అంచనా వేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా వేగుల ద్వారా పోలీసులు సమాచారం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో రాజ్యలక్ష్మి అలియాస్ పద్మపై ఓ సారి, శాంతయ్యపై ఓ సారి హత్యాయత్నం జరగగా స్కెచ్ ఫెయిల్ అకావడంతో పాటు నెల రోజుల క్రితం శాంతయ్యను చితక బాదినట్టు కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సారి ఎలాగైనా తమ ప్లాన్ బెడిసికొట్టవద్దని అన్ని రకాలుగా సన్నదమై హంతకులు వెంకటాపూర్ లోని శివయ్య ఇంటికి చేరుకున్నట్టుగా అర్థం అవుతోంది. ఇంటి బయట తలుపు గొల్లెం పెడుతున్న క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు బయటకు వస్తే వారిపై దాడి చేసేందుకు వ్యూహ రచన చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా మిర్చిపోడితో పాటు ఇతరాత్ర వస్తువులను వెంట తీసుకుని వచ్చారని గుర్తించారు.

వేటకు కారణమేంటో…?

అయితే శాంతయ్యను, పద్మను లక్ష్యంగా చేసుకుని హంతకులు వేటాడితే చివరకు మౌనిక ఆమె ఇద్దరు పిల్లలు, ఇంటి యజమాని శివయ్యలు కూడా బలయ్యారు. సింగరేణిలో సర్దార్ గా పనిచేస్తున్న శాంతయ్య డిపెండెంట్ ఉద్యోగాన్ని వేరే వారికి ఇస్తారని, స్థిరస్థులను అమ్మగా వచ్చిన డబ్బులను తమకు ఇచ్చే అవకాశం లేదన్న కారణంతోనే కొంతకాలంగా అతని కడుపున పుట్టిన బిడ్డలు టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది. డిపెండెంట్ ఉద్యోగం లభించినట్టయితే తమకు ఉపాధి దొరకుతుందని అతని వారసులు అంచనా వేసుకున్నప్పటికీ దానిని వేరే వారికి ఇవ్వాలని శాంతయ్య నిర్ణయించుకున్నాడన్న అనుమానం రావడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. తమ ఉమ్మడి కుంటుంబ ఆస్థి, తండ్రి ఉద్యోగం కూడా తమకు దక్కకపోతే ఎలా అని భావించి పలుమార్లు మర్డర్ కు స్కెచ్ వేసి విఫలం అయి ఈ సారి మాత్ర పక్కా సక్సెస్ కావాలన్న కసితోనే ఇంటిని తగులబెట్టారని తెలుస్తోంది. శాంతయ్య కారణంగానే రెండు కుటుంబాల్లో ఆ శాంతి నెలకొని చివరకు హత్యలకు దారి తీసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఎంత మందో పాల్గొన్నారో..?

ఆరుగురి సజీవ దహనం కేసులో ఒకరిద్దరు మాత్రమే పాలు పంచుకోలేదని నలుగురికి పైగానే ఇన్ వాల్వ్ అయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంటికి నిప్పటించేంత సాహసం చేయడం ఒకరిద్దరితో మాత్రం కాదని అంచనా వేస్తున్న పోలీసులు నిందితులందరిని గుర్తించే పనిలో పడ్డారు. అర్థరాత్రి వేళ అయితే అనువుగా ఉంటుందని ఇందుకు అవసరమైన పథకాన్ని రచించుకున్న నిందితులు ఘటనకు పాల్పడిన రోజు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారోనన్న విషయాన్ని తెలుసుకోలేకపోయారు. శివయ్య మాత్రం ఇంటి బయట నిద్రిస్తాడని గుర్తించినప్పటికీ ఆయనతో పాటు మౌనిక తన పిల్లలతో సహా అదే ఇంట్లో ఉండడంతో కాలి బూడిద అయిపోయారు.

చివరి ప్రాణమూ చిన్నమ్మతోనే…

ఈ ఘటనలో మౌనిక, ఆమె కూతుళ్ల మరణం అత్యంత విషాదాన్ని నింపుతోంది. సంఘటన జరిగిన తరువాత మృతుల బంధువులు చెప్తున్న వివరాలు వింటే కన్నీళ్లు కార్చక మానరు. చిరు ప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయిన మౌనిక తన చిన్నమ్మ పద్మతో సాన్నిహిత్యంగా ఎక్కువగా ఉండేది. ఇటీవలె దండెపల్లి వాసితో వివాహం జరిగగా ఇద్దరు చిన్నారులు స్వీటీ, హిమబిందులకు జన్మినిచ్చింది. అయితే రెండేళ్ల క్రితం భర్త కూడా చనిపోవడంతో పెద్ద దిక్కుగా ఉన్న చిన్నమ్మ పద్మ సపోర్ట్ తో జీవనం సాగిస్తోంది. తనకు అనారోగ్యంగా ఉందని చేదోడుగా ఉండేందుకు రావాలని చిన్నమ్మ కోరడంతో మౌనిక రెండు రోజుల క్రితమే వెంకటాపూర్ కు చేరుకుంది. శుక్రవారం నాటి ఘటనలో చిన్నమ్మతో పాటు పద్మ, ఆమె కూతుళ్లు ఇద్దరూ కూడా సజీవ దహనం కావడంతో ఆమె కుటుంబమే లేకుండా పోయిందని స్థానికులు కంట తడి పెట్టుకుంటున్నారు. పెద్ద దిక్కు లేకుండా ఉన్న మౌనికకు అండగా నిలిచిన చిన్నమ్మ వెంటే మృత్యువు ఒడిలోకి చేరిపోయిందా అంటు వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

You cannot copy content of this page