అక్టోబర్ 3 నుండి 12 వరకు నవరాత్రోత్సవాలు
ప్రారంభమైన భవానీ దీక్షలు
దిశ దశ, కరీంనగర్:
ఒకే ప్రాంగణంలో ముగ్గురు అమ్మవార్లు వెలిసిన శ్రీ మహాశక్తి ఆలయం. కరీంనగర్ చైతన్యపురిలో ఉన్న ఈ దేవాలయంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకుని శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన మహాశక్తి దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబైంది. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆశీస్సులతో అక్టోబర్ 3 నుండి 12 తేదీ వరకు నవరాత్రి వేడుకలు జరగనున్నాయి.
ఆలయ విశిష్టత
ముల్లోకాలకు మూలమైన శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన ఆలయమిది. ప్రార్థిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలతో పాటు కోరికలు తీర్చే కల్పవల్లులు. నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శిస్తే సర్వ శుభాలను, ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని పొందవచ్చని శాస్త్రం చెబుతోంది. ఏటా అమ్మవారి భక్తులు స్వీకరించే “భవాని దీక్ష” లు 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 11 లేదా నవరాత్రి దీక్ష తీసుకునేందుకు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. నవరాత్రోత్సవాలలో భవాని దీక్ష చేపట్టి అమ్మవారిని భక్తితో కొలిస్తే ఎలాంటి బాధనుంచైనా ఉపశమనం లభిస్తుందని సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
వివిధ రూపాలలో…
శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవార్లు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. 3వ తేదీ గురువారం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 8 గంటలకు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి పూజ, స్వస్తి పుణ్యహవాచనం, గణపతి పూజ, మాతృకపూజ, నాంది, ఆంకురారోపణము, అఖండ దీపారాధనము, సర్వతో భధ్రమండలం, చతుషష్టి ఉపచారపూజ, మంత్రపుష్పము, సాయంత్రం 6 గంటలకు శ్రీ మహాదుర్గా అమ్మవారికి ఫలపంచామృతాభిషేకం పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. 4వ తేదీ శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారంలో కనిపించనున్న అమ్మవారికి ఉదయం 8 గంటలకు శ్రీ గాయత్రీ దేవి పూజ, డ్రై ఫ్రూట్స్ తో అలంకరణ, సాయంత్రం 6 గంటలకు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. 5వ తేదీ, శనివారం శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారంలో పూజలందుకుంటింది. ఉదయం 8 గంటలకు శ్రీ అన్నపూర్ణాదేవి పూజ, అమ్మవారికి శాకాంబరీ అలంకరణ చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు 108 రకాల నైవేద్యాల సమర్పణ, కొడకండ్ల రాధాకృష్ణ శర్మచే భగవన్నామ సంకీర్తనం కార్యక్రమం నిర్వహిస్తారు. 6 తేదీ, ఆదివారం శ్రీ లలితా దేవి దేవి (కూష్మాండ ) అవతారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవార్లకు ఉదయం 8 గంటలకు శ్రీ లలితా దేవి పూజ, గాజులతో అలంకరణ. సాయంత్రం 6 గంటలకు లలిత సహస్రనామాలు, సౌందర్య లహరి, కనకధార స్తోత్ర పారాయణం చేయనున్నారు. 7వ తేదీ, సోమవారం మహాచండీ దేవి (స్కంద మాత) అవతారం రోజున ఉదయం 8 గంటలకు శ్రీ మహా చండీ దేవి పూజ, పండ్లతో అలంకరణ చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు లింగార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. 8వతేదీ మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవి (కాత్యాయని) అవతారం లో దర్శనం ఇవ్వనున్న అమ్మవారికి ఉదయం 10 గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవి పూజ, నాణేలు, తామర పూలతో అలంకణ చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం చేయనున్నారు. 9వతేదీ బుధవారం మూలా నక్షత్రం – శ్రీ సరస్వతి దేవి (కాళరాత్రి) అవతారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారికి ఉదయం 8 గంటలకు శ్రీ సరస్వతి దేవి పూజ, అమ్మవారికి పూలతో అలంకరిస్తారు. సాయంత్రం 6 గం.లకు విద్యార్థులచే సరస్వతీ పూజ, పల్లకి సేవ, రతన్ కుమార్ శిష్య బృందంచే శాస్త్రీయ ఆలయ నృత్యాలు నిర్వహిస్తారు. 10వ తేదీ గురువారం దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ) అవతారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారికి ఉదయం 8 గంటలకు శ్రీ మహా దుర్గ పూజ, అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ పూజలు చేస్తారు. 11వతేదీ శుక్రవారం మహార్నవమి – శ్రీ మహిషాసురమర్ధిని దేవి (సిద్ధి రాత్రి) అవతారంలో కనిపించనున్నారు. ఉదయం 8 గంటలకు శ్రీ మహిషాసురమర్దిని దేవి పూజ, అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరణ చేస్తారు. రుద్ర సహిత చండీ హోమం సాయంత్రం 7 గంటలకు మహిషాసుర సంహారం, 12 వ తేదీ శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి పూజ (విజయదశమి), ఉదయం 8 శ్రీ రాజరాజేశ్వరి పూజ, శమీ పూజ,
ఉదయం 9 గంటల నుండి వాహన పూజలు జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 9 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో దాండియా కార్యక్రమం ఈ ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు.