షాకింగ్ న్యూస్: మళ్లీ పెరిగిన వంట నూనెల ధరలు

సామాన్యుడికి కేంద్రం షాక్ ఇచ్చింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వేరుశనగ నూనె ధర లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది. ఫిబ్రవరి 26 నాటికి వేరుశనగ నూనె లీటరుకు రూ.180లకు చేరుకుంది. పామాయిల్‌ ధర లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు పెరిగి ప్రస్తుతం రూ.104లకు చేరుకుంది. ఇక పొద్దు తిరుగుడు నూనె లీటరుకు రూ.135 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది.

దేశీయంగా నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరుశనగ నూనెకు అధిక డిమాండ్‌ పెరగడం వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తర్వాత నుంచి చైనా.. భారత్ నుంచి వేరుశనగ దిగుమతులను పెంచింది. పైగా ఆ దేశంలో వేరుశనగ నూనెకు డిమాండు ఎక్కువ పలుకుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 104 లక్షల టన్నుల వేరుశనగ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. 100 లక్షల టన్నులే వస్తుందని ఈ నెల 14న విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడైంది.

దేశంలో తొమ్మిది రకాల నూనెగింజల పంటలు కలిపి 423 లక్షల టన్నులను లక్ష్యంగా నిర్ణయించారు. రెండో ముందస్తు అంచనాల ప్రకారం 400 లక్షల టన్నుల మేర వస్తుందని గుర్తించారు. కాగా, దేశంలో వేరుశనగ సాగు, ఉత్పత్తిలో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. మొత్తం ఉత్పత్తిలో 45 శాతం పంట ఆ రాష్ట్రంలోనే పండిస్తున్నారు. తర్వాత రాజస్థాన్‌, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి.

గుజరాత్‌లోని గోండల్‌ ప్రాంతంలో వందకు పైగా నూనెతయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆయిల్‌ఫెడ్‌ సైతం అక్కడి నుంచే నూనెను దిగుమతి చేసుకుని విజయ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తోంది. అయితే ఈ ఏడాది గుజరాత్‌లో వేరుశనగ పంట ఉత్పత్తి తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.7,400 నుంచి రూ.8,400 వర ధర పలుకుతోంది. పొద్దుతిరుగుడు నూనె లీటరు ధర రూ.135 దగ్గర కొనసాగుతోంది. దిగుమతులు తగ్గిపోవడం, ఎగుమతులపై ఇండోనేసియా ఆంక్షలు విధించడం కారణంగా దేశీయంగా వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి.

You cannot copy content of this page