ఏసీబీ సెర్చ్ వారెంట్ అరెస్ట్ అయ్యే అవకాశం..?

దిశ దశ, హైదరాబాద్:

హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కార్యరంగంలోకి దిగింది. ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసు విషయంలో ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించిన ఏసీబీ హైకోర్టు ఆదేశాలతో సోదాలకు శ్రీకారం చుట్టింది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయింది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ఇండ్లతో పాటు గ్రీన్ కో కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించేందుకు అనుతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం. అలాగే వీరిని అరెస్ట్ చేసేందుకు కూడా పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఏసీబీ కోర్ట్ అనుమతి తీసుకున్న అధికారులు హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సెర్చింగ్ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది.

సుప్రీంకోర్టులో కెవియట్…

మరోవైపున హైకోర్టు మాజీమంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ముందుగానే ఆశ్రయించింది. కెవియట్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం తరుపు అడ్వకేట్ తెలంగాణ ప్రభుత్వం వాదనలు విన్న తరువాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో కేటీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లినా వెంటనే ఏసీబీకి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

ఏసీబీ కేసు…

ఈ ఫార్మూలా కేసుకు సంబంధించిన డబ్బులు విడుదల చేయడంలో నిబంధనల మేరకు నడుచుకోలేదని ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, అ‌రవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేయకుండా విదేశీ కంపెనీకి నిధులు విడుదల చేశారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా కేటీఆర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించిన ఆధారాలను, సోదాల్లో లభ్యమైన ఎవిడెన్స్ లను బేస్ చేసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

అనుమతి లేకుండా?

ఈ కార్ ఫార్మూలా రేసింగ్ లో విదేశీ కంపెనీకి రూ.55 కోట్లు పంపించడం ఫెమా ఉల్లంఘన కిందకు వస్తుందని ఈడీ అధికారులు వాదనలు తెరపైకి తెచ్చారు. విదేశీ కంపెనీలకు నిధులు పంపించినప్పుడు ఆర్బీఐ తో పాటు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖ అనుమతి తీసుకోకుండా నిధులు విదేశి కంపెనీకి ప్రభుత్వ నిధులు పంపించారని ఈడీ చెప్తోంది. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. దీంతో ఏసీబీ, ఈడీ కేసులను కేటీఆర్, అధికారులు ఎదుర్కోక తప్పదని స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page