దిశ దశ, కరీంనగర్:
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ కు అధిష్టానం ఝలక్ ఇచ్చింది. ఎన్నికలు జరిగిన రెం నెలలకు క్రమశిక్షణ కమిటీ నుండి శ్రీముఖం అందుకున్నారు. నియోజకవర్గ ఇంఛార్జీకి నోటీసులు రావడం కరీంనర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. లోకసభ అభ్యర్థిత్వం కూడా తనకే ఇవ్వాలని కోరిన పురమళ్ల శ్రీనివాస్ కు సంజాయిషీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న పురుమళ్ల శ్రీనివాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఓటమి పాలయ్యామన్న ఫిర్యాదుల వచ్చాయని క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించినట్టుగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. అంతేకాకుండా పార్టీ శ్రేణులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రచారం కొనసాగించడం, ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖుల పర్యటనల ఏర్పాట్లలోనూ విఫలం అయ్యారని చిన్నారెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన ఫండ్ ను కూడా ఎన్నికల్లో ఖర్చు చేయలేదని కూడా ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ ఆరోపణలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు ద్వారా పురుమళ్ల శ్రీనివాస్ ను ఆదేశించారు.