దిశ దశ, మంథని:
దేవాదాయ శాఖలో పని చేస్తున్న తన తండ్రి మరణించినప్పుడు మైనర్ గా ఉండడమే అతని పాలిట శాపంగా మారింది. చిరు ప్రాయంలో తండ్రిని కోల్పోయిన ఆ బిడ్డ డిగ్రీ వరకూ చదువుకుని తనకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలని అభ్యర్థిస్తే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారని అధికారులు చెప్తున్నారు. తండ్రి మరణించినప్పుడు కారుణ్య నియామకంలో దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగల వయసు లేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
కాళేశ్వరం ఉద్యోగి…
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మారుపాక నాగన్న ఎలక్ట్రిషియన్ గా విధులు నిర్వర్తిస్తుండగా అకాల మరణం చెందాడు. అప్పటికే అతని భార్య అరుణ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2011లో నాగన్న మరణించినప్పుడు అతని కొడుకు నాగఫణి శర్మ 8 ఎళ్ల వయసులో ఉన్నాడు. తండ్రి మరణించినప్పుడు ప్రాథమిక విద్య మాత్రమే చదువకుంటున్న నాగఫణి శర్మకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవాలని కూడా తెలియదు. ఆయన మరణించిన కొంత కాలనికే తల్లిని కూడా కోల్పోయిన నాగఫణి శర్మ చదువుపైనే దృష్టి సారించాడు. అయితే ఇటీవలే మేజర్ అయిన నాగఫణి శర్మ తనకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ దేవాదాయ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారని కారుణ్య నియామకం ద్వార ఉద్యోగం ఇవ్వలేమని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా నాగఫణి శర్మకు న్యాయం చేయాలని, తండ్రి మరణించినప్పుడు మైనర్ అయినందున అతనికి ఉద్యోగావకాశం కల్పించాలని దేవాదాయ శాఖ అధికారులకు లేఖ రాశారు. ఎండోమెంట్ అధికారులు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని నాగఫణి శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణించినప్పుడు మైనర్ గా ఉన్న తాను ఎలా దరఖాస్తు చేసుకోగలుగుతానని అప్పుడు దరఖాస్తు చేసుకోవాలన్న విషయం కూడా తనకు తెలియదని అంటున్నారు. ఒకవేళ తాను దరఖాస్తు చేసుకున్నా తను ఉద్యోగం పొందడానికి తగ్గ వయసు లేదన్న కారణం చూపించే అవకాశం ఉండేది కదా అని అంటున్నారు. డ్యూటీ చేస్తూ అకాల మరణం చెందిన ఉద్యోగులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారసులకు ఉపాధి కల్పించే విషయంలో నిబంధనల బూచి చూపించడం సరికాదన్నారు. ఇప్పుడు మేజర్ అయినందున తనకు ఉద్యోగం ఇప్పించేందుకు అధికారులు మానవతా దృక్ఫథంతో ఆలోచించాలని వేడుకుంటున్నారు.
ప్రత్యామ్నాయంగానైనా…
కారుణ్య నియామకం విషయంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయినా నాగఫణి శర్మకు ఉపాధి కల్పించేందుకు చొరవ చూపించే అవకాశాలు లేకపోలేదు. దేవాదాయ శాఖలో తాత్కాలిక ఉద్యోగం కల్పించినా బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కన్సాలిడేటెడ్ పే ఉద్యోగిగా అయినా అవకాశం కల్పించినట్టయితే తమ శాఖలో పనిచేస్తూ మరణించిన కుటుంబానికి బాసటగా నిలిచినట్టు అవుతుందన్న విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆ శాఖలో అలా…
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయిన ఓ ఉద్యోగి విషయంలో కారుణ్య నియామకం విషయంలో గతంలో మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగి మరణించిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోనట్టయితే కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించడం కుదరదని నిబంధనలు చెప్తున్నాయి. అయినప్పటికీ ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చి అతని వారసునిగా ఉద్యోగం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. రెండూ కూడా ప్రభుత్వ శాఖలే అయనందున వేర్వేరు విధానాలు అయితే ఉండవన్న విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నాగఫణి శర్మ కారుణ్య నియామకం విషయంలో కూడా సానుకూలంగా స్పందించాలని అభ్యర్థిస్తున్నారు.