నాలుగు నెలల్లో రిటైర్ కానున్న ఎస్సై: ఏసీబీ ట్రాప్…

దిశ దశ, కోరుట్ల:

మరో నాలుగు నెలల్లో పదవి విరమణ పొందాల్సిన పోలీసు అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గేమింగ్ యాక్టులో దొరికిన వ్యక్తికి BNSS యాక్టు 35 ద్వారా నోటీసులు ఇవ్వడానికి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా కోరుట్ల ఎస్సై రూపావత్ శంకర్ (60) ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కోరుట్ల మండలం జోగినపల్లి శివార్లలో జూదం ఆడుతున్న సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేయగా వారిలో ఒకరికి నోటీసు ఇవ్వడానికి లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు బుధవారం ఎస్సై శంకర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ పరీక్షలో కూడా నిర్దారణ కావడంతో ఎస్సైని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నారు. మరో నాలుగు నెలల్లో రిటైర్ కావల్సిన ఎస్సై శంకర్ ఏసీబీకి ట్రాప్ కావడంతో అతనికి రావల్సిన బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉండకపోగా ఏసీబీ కేసు విచారణను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఏసీబీ కేసు కావడంతో అతనికి వెంటనే బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదు. దీంతో పదవి విరమణ పొందే సమయంలో ఆయన జైలు జీవితం గడపాల్సిన దుస్థితి ఎదురైంది. 

You cannot copy content of this page