అవసరం నేర్చుకోమంటే… ఆలోచన నేర్పమంది…

సింపుల్ ట్రిక్స్ తో ఇంగ్లీష్ భాషపై పట్టు

సర్కారు టీచర్లకు నేర్పించడమే లక్ష్యం

దిశ దశ, హైదరాబాద్:

సర్కారు బడిలో ప్రాథమిక విద్య… ప్రైవేటు స్కూళ్లో బోటాబోటి చదువులు… ఉన్నత విద్య కోసం హైదరాబాద్ పయనం… ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆ బిడ్డ ఆలోచనే ఆదర్శనీయం… తెలంగాణా అనగానే ఇంగ్లీష్ లో వీక్ అన్న మాట ఆ మనసును కదిలించి వేసింది… అంతే తాను పుట్టిపెరిగిన గడ్డకు తనవంతుగా బాధ్యత నెరవేర్చాలని భావించాడు. ఆ ఆలోచనే ఆయనను కార్యోన్ముఖుడిని చేసింది.

వ్యవసాయం కుటుంబం…

షాద్ నగర్ సమీపంలోని నందిగామకు చెందిన రామేశ్వర్ గౌడ్ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అంజయ్య గౌడ్, పద్మమ్మ దంపతులకు ఐదుగురి సంతానంలో మధ్యముడిగా జన్మించిన ఆయన విద్యనందుకోవడానికి ఎదుర్కొన్న కష్టాలు అన్నిఇన్ని కావు. ఒడిదొడుకులతో సాగిన ఆయన పయనం ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఉపాధి కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న రామేశ్వర్ గౌడ్ సాధారణ విద్యతోనే తన జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. కార్పోరేట్ చదువులు అందుకునే పరిస్థితులకు భిన్నంగానే ఆయన ముందుకు సాగారు. ఐదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ బడిలో… హైస్కూల్ వరకు గ్రామంలోని ప్రైవేటు స్కూళ్లో పూర్తి చేశారు. ఇంటర్ నుండి పీజీ వరకు హైదరాబాద్ లో కంప్లీట్ చేసిన రామేశ్వర్ గౌడ్ ఎక్కువగా తెలుగు మాధ్యమంతోనే కొనసాగించాల్సి వచ్చింది.

ఆ ఆలోచన…

డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉపాధి కోసం ఆస్ట్రేలియా పయనం కావాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు ఇంగ్లీష్ ను ఒక సబ్జెక్ట్ లాగానే భావించిన రామేశ్వర్ గౌడ్ అప్పుడు దాని ప్రాధాన్యతను గుర్తించి ఆంగ్లభాషపై పట్టు సాధించాలన్న పట్టుదల పెంచుకుని సక్సెస్ అయ్యారు. ఆస్ట్రేలియాకు వెల్లి సుస్థిరమైన జీవనాన్ని సాగించాలనుకున్న ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ బోధనపై అందరిని సుశిక్షుతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం వైపు సాగుతున్నారు. తెలంగాణాకు చెందిన వారు ఇంగ్లీష్ లో ‘పూర్’ అంటూ 2010 చేసిన కామెంట్లు రామేశ్వర్ గౌడ్ ను మానసిక వేదనకు గురి చేశాయి. తనవంతుగా తెలంగాణ బిడ్డలకు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా తయారు చేయాలన్న సంకల్పం పెట్టుకుని సక్సెస్ బాటలో సాగుతున్నారు. ‘‘Will 2 can ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’’ పేరిట 2007లో బోధానా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నామమాత్రపు రుసుంతో శిక్షణ ఇస్తున్నారు. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఇప్పటి వరకు ఆయన 45 వేల మందికి పైగా ఇంగ్లీష్ భాషను నేర్పిచడంతో పాటు… తన లక్ష్యం వైపు ఇంకా సాగుతూనే ఉన్నారు.

సర్కారుపై మమకారం…

సర్కారు పాఠశాలలో ఇంగ్లీష్ బోధన ప్రభుత్వం ప్రవేశపెట్టిన తరువాత మరో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు రామేశ్వర్ గౌడ్. ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడిపోయిన వారంతా ఇంతకాలం తెలుగు భాషలోనే చదువు చెప్పారు. అనూహ్యంగా ప్రభుత్వం ఇంగ్లీష్ భాషలో విద్యా బోధనకు శ్రీకారం చుట్టడంతో టీచర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన రామేశ్వర్ గౌడ్ తనవంతుగా టీచర్లకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి మాత్రమే ఉచితంగా అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని 25 జిల్లాలకు చెందిన ప్రభుత్వ టీచర్లకు ఫిజికల్ క్లాసులు నిర్వహించి ఆ తరువాత ఆన్ లైన్ లో అవగాహన కల్పించే పనికి శ్రీకారం చుట్టారు. సెలువు దినాల్లో ఫిజికల్ క్లాసులు… మిగతా రోజుల్లో స్కూల్ క్లోజ్ అయిన తరువాత ఆన్ లైన్ లో ఇంగ్లీష్ భాషపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ బడిలో పేద, మధ్య తరగతి విద్యార్ధులే ఎక్కువగా చదువుకుంటున్నందున ఆ కుటుబాలకు చెందిన విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిన ఇంగ్లీష్ ను ప్రభుత్వ టీచర్లకు అందిస్తే బావుంటుందన్న యోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారని, దీంతో వారి మార్గం సుగమంగా సాగిపోతుందని గుర్తించారు.

సింపుల్ ట్రిక్స్…

అయితే రామేశ్వర్ గౌడ్ ఇంగ్లీష్ విద్యా బోధనలో పాత పద్దతులకు స్వస్తి పలికి తనదైన స్టైల్లో సింపుల్ ట్రిక్స్ తయారు చేశారు. తెలుగు మాట్లాడడం వస్తే చాలు… ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తారంతే అంటున్నారు. ఇదే పద్దతిలో ఆయన ఆంగ్ల భాషపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే పనిలో నిమగ్నమై సక్సెస్ బాటలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే 45 వేల మందికి ఆయన క్రియేట్ చేసిన సింపుల్ ట్రిక్స్ తో ఇంగ్లీష్ నేర్పించారంటే రామేశ్వర్ గౌడ్ ఎంచుకున్న సులువైన మార్గానికి ఎంతటి స్పందన వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

నా లక్ష్యం అదే: రామేశ్వర్ గౌడ్

ఇంగ్లీష్ అంటే అవగాహన లేదన్న భయాన్ని వీడి… తాము కూడా సునాయసంగా మాట్లాడుతామంటూ చేతల్లో చూపించే తెలంగాణ తయారు కావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న గురువులను సుశిక్షుతులుగా తీర్చిదిద్దినట్టయితే ప్రభుత్వ పాఠశాలలే ఆంగ్ల బోధనకు కేరాఫ్ గా మారి కార్పోరేట్ విద్యా బోధనకు ధీటైన కేంద్రాలుగా మారిపోతాయి. అప్పుడే తెలంగాణ అంతటా కూడా ఇంగ్లీష్ మాధ్యమం అనేది సాధారణ భాషగా మారిపోతుంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషతో మన బిడ్డలు మమేకం అయితే అంతర్జాతీయ సమాజంలోనూ నిలదొక్కుకోగలుగుతారు. అయితే ప్రభుత్వ పాఠాశాలల్లో పని చేసే ఉపాధ్యాయలోకానికి నావంతుగా ఉచిత బోధన అందించాలన్న నా లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా చేదోడుగా నిలిస్తే… ఆ బాధ్యతను నా భుజస్కందాలపై వేసుకుని ముందుకు సాగుతాను.
www.will2can.com

You cannot copy content of this page