రెండు సంఘాలే హాజరు…
12 సంఘాలు డుమ్మా…
దిశ దశ, భూపాలపల్లి:
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ అలా విడుదలయిందో లేదో పోలింగ్ సజావుగా సాగుతుందా లేదా అన్న చర్చ మొదలైంది. కేవలం రెండు సంఘాల సమక్షంలో మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటన్న ప్రశ్న లేవనెత్తుతున్నాయి ఇతర సంఘాలు. దీంతో కార్మిక సంఘాలు లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులపై కారాలు మిరియాలు నూరుతున్నాయి.
సుప్రీంను ఆశ్రయించే అవకాశం..?
అయితే 27వ తేదిన హుటాహుటిన సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగించడంతో కార్మిక సంఘాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్ స్టార్ట్ అయింది. సింగరేణి కాలరీస్ కంపెనీలో 14 సంఘాలు రిజిస్టర్ అయి ఉండగా బుధవారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్ సమయంలో కేవలం 2 సంఘాలు మాత్రమే హాజరు కావడం మిగతా సంఘాల వారికి ప్రధానాస్త్తంగా మారిపోయింది. కేంద్ర కార్మిక శాఖ అధికారుల తీరుపై ఆయా కార్మిక సంఘాలు తప్పు పట్టే అవశం లేకపోలేదు. గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ సంస్థలో రిజిస్టర్ అయిన ప్రతి సంఘాన్ని కూడా సమానంగా చూస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అంశం గురించి కేంద్ర కార్మిక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి కేవలం ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలకు చెందిన ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. టీబీజీకెఎస్, సింగరేణి కోల్ మైన్స్, సింగరేణి మైన్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్, గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం, సింగరేణి గని కార్మిక సంఘం, సింగరేణి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, ది తెలంగాణ సింగరేని ఉద్యోగ సంఘం, తెలంగాణ రీజినల్ సింగరేణి కార్మిక సంఘం, సింగరేణి డ్రైవర్స్, ఈపీ ఆపరేటర్స్ అండ్ యూజీ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్, తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాలేదు. కేవలం రెండు సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదని, సింగరేణిలో రిజిస్టర్ అయిన మెజార్టీ సంఘాల ప్రతినిధులు హాజరు కాకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారోనన్న విషయాన్ని లేవనెత్తుతున్నారు. ఇదే అంశంపై ఆయా సంఘాలు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై మరింత కాలం ప్రతిష్టంభన కొనసాగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.
ఆటంకాలు ఎన్నో…
కార్మిక సంఘాల అభ్యంతరాలే కాకుండా సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో కూడా ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా నివేదికలు పంపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబ్బంది కొరతతో పాటు ఇతరాత్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదంటూ ఆరు జిల్లాల కలెక్టర్లు నివేదికలు కూడా ఇచ్చారు. ఈ అంశాన్ని కూడా కార్మిక సంఘాలు కోర్టులో లేవనెత్తి గుర్తింపు సంఘం ఎన్నిలపై తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేయించాలని అభ్యర్థించే అవకాశం లేకపోలేదు. సింగరేణి పరిధిలో కార్పేరేషన్, కొత్తగూడెం, మణుగురు, ఇల్లందు, రామగుండంలోని మూడు రీజియన్లు, భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ లలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఆరు డివిజన్లను కైవసం చేసుకున్న సంఘానికి గుర్తింపు హోదా దక్కనుంది. అయితే ఎప్పుడో జరగాల్సిన ఈ ఎన్నికలు నేటికీ ఎదో కారణంచేత వాయిదా పడుతుండడం గమనార్హం. తాజాగా ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి పునరావృతం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.