గంజాయి అక్రమ రవాణాలో సిరిసిల్ల కారు సీజ్… పట్టుకున్న కర్ణాటక పోలీసులు…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

కర్ణాటక రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న కేసుకు తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి లింక్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పట్టుబడ్డ రెండు వాహనాల్లో ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వారిది కావడం సంచలనంగా మారింది. సిరిసిల్ల కేంద్రంగా అంతరాష్ట్ర గంజాయి దందా సాగుతోందా లేక స్మగ్లర్లతో జిల్లా వాసులు మిలాఖత్ అయ్యారా అన్న విషయమే హాట్ టాపిక్ గా మారింది. 

అసలేం జరిందంటే..?

గత సంవత్సరం నవంబర్ నెలలో కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా పోలీసులు రెండు కార్లలో తరలిపోతున్న గంజాయిని, ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురితోనే దర్యాప్తును అర్థాంతరంగా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తవంగా విజయపుర జిల్లా పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులకు వాహనాలతో ఏ మాత్రం సంబంధం లేదని సమాచారం. ఇందులో ఒక కారు గురుకుల పాఠశాలలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న వారిదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సదరు కారు గతంలో పోలీసులు జరిమానా వేసినప్పుడు కొత్త కొత్త వ్యక్తులు సంచరించినట్టుగా పోలీసు రికార్డుల్లో నమోదయిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. రాజన్న జిల్లా కేంద్రానికి చెందిన సదరు కారు యజమాని ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్టుగా సమాచారం. కారు నంబర్ల ఆధారంగా విచారణ చేపట్టని కర్ణాటక రాష్ట్ర పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచరించి వెల్లిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే కారు యజమానికి సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు స్థానిక పోలీసులతో సంబంధం లేకుండానే ఆరా తీసి వెల్లిపోవడం వెనక జరిగిన మతలబు ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది. సాధారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులు కేసు విచారణ కోసం వెల్లినప్పుడు సంబంధిత జిల్లాకు చెందిన పోలీసు అధికారులకు సమాచారం చేరవేసి విచారణ చేయడం, కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు సంబంధిత ఠాణాల్లో పనిచేస్తున్న వారి సహకారం తీసుకునే సాంప్రాదాయం కొనసాగుతుంటుంది. కానీ విజయపుర జిల్లాలో గంజాయి దొరికిన కారు విషయంలో మాత్రం కర్ణాటక పోలీసులు మొక్కుబడి విచారణతోనే సరిపెట్టిన తీరు సంచలనంగా మారింది.

వారి చేతికెలా..?

తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన కారులో యాజమానితో సంబంధం లేని వ్యక్తులు తరుచూ సంచరిస్తుండడం, అదే కారు కర్ణాటకలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడంతో అనుమానాలకు దారి తీస్తోంది. యజమానికి సంబంధం లేకుండానే చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కారు తిరుగడం సాధ్యమేనా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఘటనల్లో వేరే వ్యక్తులు సదరు కారులో తిరుగుతున్నట్టుగా తేలడంతో దీనివెనక ఏదో తతంగం సాగుతోందా అన్న చర్చ స్థానికంగా సాగుతోంది. ఒక వేళ కారు ఇతరులకు విక్రయంచినట్టయితే కొనుగోలు చేసిన వారి పేరిట బదిలీ చేయకపోవడానికి కారణం ఏంటీ..? ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నందున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు తన ఉద్యోగానికి కూడా ఇబ్బందిగా మారుతుందన్న విషయం గమనించకుండా ఉంటారా..? అన్న అంశంపై కూడా స్థానికంగా తర్జనభర్జనలు సాగుతున్నాయి. అయితే సిరిసిల్ల ప్రాంతానికి చెందిన మరో వ్యాపారితో సదరు కారు యజమానితో సాన్నిహిత్యం ఉందని, ఈ కారణంగానే కారులో అసాంఘీక శక్తుల సంచారిస్తుంటారన్న అనుమానం కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్న సందర్బాలు లేకపోలేదు. గత ప్రభుత్వ హయాంలో సదరు వ్యాపారి వద్ద నిషేధిత పొగాకు ఉత్పత్తులు కూడా దొరకగా కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇతరులను నిందితులుగా చూపించి ఆయనకు ‘‘తీపి’’ కబురు అందించారన్న ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా కర్ణాటకలో గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం కూడా ఇందులో భాగమే అయి ఉంటుందని అయితే అక్కడి పోలీసులు మాత్రం అసలు నిందితులను పట్టుకోకుండా వదిలేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సదరు వ్యాపారికి కారు యజమానికి మధ్య కూడా ఇటీవల కారు సీజ్ అయిన విషయంలో వాదనలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. తన కారు సీజ్ అయినందున వేరే కార్ ఇప్పించాలన్న ప్రతిపాదనపై ఇరువురి మధ్య గొడవకు దారి తీసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ అంశం బయటకు పొక్కడంతో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన విభాగంలో పనిచేస్తున్న కారు యజమాని చట్టవ్యతిరేక శక్తులతో చేతులు కలపడమేంటని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో పట్టుబడ్డ గంజాయికి తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి లింక్ బయటపడడం సంచలనంగా మారింది.

You cannot copy content of this page