అక్కడ ధీమా… ఇక్కడ డ్రామా..!

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

దేశంలోనే అరుదైన క్షేత్రాల్లో ఒకటిగా వెలిసిన ఖిల్లా… అతి చిన్న జిల్లా ఒకటైన సిరిసిల్ల… ఉవ్వెత్తిన ఎగిసిపడిన ఉద్యమాలకు కేరాఫ్… నేతన్నల నిలయం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. విముక్తి కోసం జరిపిన పోరాటంలో అయినా, పిడికిలెత్తి విప్లవాన్ని రగిల్చినా సిరిసిల్ల తన ప్రత్యేకతను చాటుకుంది. స్వరాష్ట్ర కల సాకారంలోనూ కీలక భూమిక పోషించిన ఈ జిల్లా కేంద్రం నుండి మంత్రి కేటీఆర్, వేములవాడ నుండి చెన్నమనేని రమేష్ బాబులు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో నేడు వైవిద్యమైన పరిస్థితులు నెలకొన్నాయి.

ఆయన ఓకె…

సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుండి పోటీ చేయనున్నారు. సిరిసిల్ల నుండి మరో నేత టికెట్ కూడా ఆశించే పరిస్థితి లేకపోగా కేటీఆర్ చరిష్మా, కరిష్మాపైనే సాగుతున్నందున వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా నిలుస్తారు. నియోజకవర్గంలోని కొన్ని చోట్ల సెకండ్ క్యాడర్ మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల అరెస్టులు పరంపర, సోషల్ మీడియా వేదికగా జరిగిన పోస్టుల విషయంలో పోలీసుల హెచ్చరికలు వంటి అంశాలపై కేటీఆర్ పై కొంతమందిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఏడు దశాబ్దాల చరిత్రలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించడం కేటీఆర్ తోనే ప్రారంభం అయింది. 2014 నుండి ఇప్పటి వరకు సిరిసిల్ల రూపురేఖలనే మార్చిన ఘనత అందుకున్నది మాత్రం కేటీఆరే.

మరి ఈయనో…?

వేములవాడ నుండి అప్రతిహతంగా గెలుచుకుంటూ వస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న వారు ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రజల్లోకి చొచ్చుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపున మంత్రి కేటీఆర్ కూడా రమేష్ బాబును కాదని టికెట్ అడుగుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రమేష్ బాబుకు టికెట్ వస్తుందా రాదా అన్న తర్జనభర్జనలు పార్టీ వర్గాల్లో సాగుతున్నాయి. అయితే నియోజకవర్గంలో సొంత ఓటు బ్యాంకు ఉండడం రమేష్ బాబుకు కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదులు చేసిన సందర్భాలూ లేకపోలేదు. ఇక్కడి నుండి చల్మెడ లక్ష్మీనరసింహరావు, ఏనుగు మనోహర్ రెడ్డి, గోలి మోహన్ లు టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ మాత్రం చల్మెడ, ఏనుగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వేములవాడలో చెన్నమనేనికి టికెట్ వస్తుందని కొంతమంది, రాదని మరికొంతమంది వాదించుకుంటున్నారంటే అక్కడ నెలకొన్న అయోమయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల పార్టీ క్యాడర్ నైరాశ్యంలోకి నెట్టివేయబడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెన్నమనేని రమేష్ బాబు ప్రత్యర్థులు పావులు కదుపుతుంటుంటే అధిష్టానం కూడా వారిని అక్కున చేర్చుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో పార్టీ పెద్దల మదిలో ఏముందోనన్నదే మిస్టరీగా మారింది.

You cannot copy content of this page