ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 20వ తేదీ వరకు ఆయన కస్టడీ కొనసాగనుంది. దీంతో ఇవాళ ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించించారు. ప్రస్తుతం ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ముఖ్యంగా సిసోడియాను తీహార్ జైలుకు తరలించే ప్రాంతాల్లో బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఇటు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు వద్ద కూడా భద్రతను పెంచారు.
మరోవైపు.. ఆప్ నేతలు అరెస్ట్‌లపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఆప్ నేతలకు పోటీగా బీజేపీ నేతలు సైతం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే విపక్షాల నేతలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తొమ్మిది మంది విపక్ష నేతలు లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని లేఖ రాసిన వారిలో సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య నేతలు ఉన్నారు. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ లేఖలో పేర్కొన్నారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయడం, బీజేపీలో చేరగానే ఆ కేసులను నీరుగార్చడం జరుగుతోందని విమర్శించారు.