అభి‘‘షేక్’’ మహంతి ఆపరేషన్ స్టార్ట్..!

దిశ దశ, కరీంనగర్:

నీళ్లలో కొమ్ములు చూపించి పశువులను అమ్మారు కొందరు… నకిలీ డాక్యూమెంట్లూ సృష్టించి అమాయకులను నిండా ముంచేశారు మరికొందరు… ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి భరతం పట్టే పని మొదలైంది కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో. అమాయకుల ఆశలే పెట్టుబడిగా చేసుకుని వారిని నిట్ట నిలువునా ముంచేసి… ప్రముఖుల పంచన చేరిన ప్రభుద్దులను వేటాడే పని కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మహంతి మొదలు పెట్టారు. అక్రమాలకు పాల్పడిన వారిని షేక్ చేసేందుకు  స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. భూ దందాలతో పాటు  ఇతరాత్ర అక్రమ వ్యవహరాలకు పాల్పడిన వారి అంతు చూసేందుకు ప్రత్యేకంగా ‘సిట్’ ఏర్పాటు చేశారు. సీనియర్ పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన ఈ టీమ్ లోతుగా అధ్యయనం చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి చిట్టా తయారు చేయనుంది. అసలైన బాధితులు తమకు అన్యాయం జరిగిందని  ఫిర్యాదు చేస్తే చాలు క్రిమినల్ చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు.

ఆపరేషన్ ‘సిట్’

ఏసీపీ స్థాయి అధికారి ప్రత్యక్ష్య పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ టీమ్ భూ క్రయవిక్రయాల పేరిట  అక్రమ దందాలపై ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేయనుంది.  బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసి తప్పెవరిది..? బాధితులకు ఎలా అన్యాయం చేశారు అన్న వివరాలను కులంకశంగా పరిశీలించి నివేదికలు తయారు చేయనున్నట్టు సమాచారం. ఈ విషయంలో బాధితులు గతంలో పోలీసు విభాగాన్ని ఆశ్రయించినట్టయితే అప్పుటి పోలీసు అధికారులు చేసిన దర్యాప్తు ఏ కోణంలో సాగింది..? వారికి సరైన న్యాయం జరిగిందా లేదా తదితర విషయాలపై ‘సిట్’ ఆరా తీయనుంది. సిట్ దర్యాప్తు తరువాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సమాయత్తం కానున్నట్టు సమాచారం.

బాధితుల ఫిర్యాదుతో…

భాధితులు ఫిర్యాదులు ఇవ్వడమే ఆలస్యం చకాచకా పోలీసులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో ఆరా తీయనున్నారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా కూడా గతంలో భూ దందాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. అయితే అప్పుడు పెద్దల అండదండలతో  చాలామంది చట్టానికి చిక్కకుండా తప్పించుకున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి విసిగిపోయారు. అయితే తాజాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా ‘సిట్’ ఏర్పాటు చేయడంతో బాధితులు కమిషనరేట్ కు క్యూ కట్టనున్నారు.

You cannot copy content of this page