అప్పుడు లీగల్ అయిన ప్రాపర్టీ… ఇప్పుడు ఇల్లీగల్ అవుతోందా..?

బాధితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ…

దిశ దశ, కరీంనగర్:

ఆధిపత్యం చెలాయించి ఇష్టా రాజ్యంగా వ్యవహరించిన కొంతమంది ప్రబుద్దుల బుద్ది మారుతున్నట్టుగా ఉంది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ల్యాండ్ మాఫియా వ్యవహారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో అక్రమార్కులు తమ పేరు బయటకు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు దర్జాతనం వెలగబెట్టి బాధితులనే నిందితులుగా నిలబెట్టిన తాము ఇప్పుడు అదే చోట నిందితులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో కాంప్రమైజ్ బాటలో సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

సీపీ కన్నెర్రతో…

కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి భూ దందాలపై కన్నెర్ర జేయడంతో కమిషనరేట్ పరిధిలో సరికొ్త్త అధ్యాయం మొదలైంది. నిన్న మొన్నటి వరకు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోగా ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాధితులు ఫిర్యాదు చేయడంతో స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపి సరైన ఆధారాలు లభ్యం అయిన తరువాత నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసులు నమోదు చేయడమే కాకుండా సాక్ష్యాధారాలు కూడా పకడ్భందీగా సేకరిస్తున్నారు. దీంతో నిందితులకు కోర్టులు ఖచ్చితంగా శిక్షలు పడేలా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు అవసరమైతే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల వాంగ్మూలాలు కూడా నమోదు చేస్తున్నారు. దీంతో అక్రమ భూ దందాలకు పాల్పడిన వారిలో సరికొత్త ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది.

బాధితుల మోక్షం కోసం…

కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న తీరుతో ఖంగుతున్న అక్రమార్కులు నెమ్మదిగా బాధితుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆరంభించారు. అప్పుడు తాము చేస్తున్నదే లీగల్ అని దబాయించి మరీ కబ్జాలకు పాల్పడిన వారు ఇప్పుడు భూములకు సంబంధించిన యజమానుల ప్రాపకం పొందేందుకు కాళ్లవేళ్లా పడుతున్నారని ప్రచారం సాగుతోంది. అక్రమ దందాలకు పాల్పడుతున్న వారికి కొంతమంది ముఖ్యులు అండగా నిలవడంతో అప్పుడు బాధితులు నిందితులుగా మారితే… కరీంనగర్ సీపీ మహంతి పుణ్యమా అని అప్పటి నిందితులు ఇప్పుడు బాధితులుగా మారిపోయారు. అక్రమార్కులు భూ యజమానుల చుట్టూ తిరుగుతూ తృణమో ప్రణమో ఇస్తాం మళ్లీ మా పేరిట రిజిస్ట్రేషన్ చేయండి లేదంటే మా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాం… మీ భూమిని మీరు స్వాధీనం చేసుకోండి అంటూ బ్రతిమాలడుతున్నారని తెలుస్తోంది. ఇలాంటి ప్రతిపాదనలకు కొంతమంది బాధితులు సుముఖుత వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది తమను అన్యాయంగా వేధింపులకు గురి చేసి హింసించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధి ఒకరు తన గుట్టు కూడా బయటపడ పడే ప్రమాదం లేకపోలేదని గ్రహించి కబ్జా చేసిన కొన్ని నివేశన స్థలాలను యజమానులకు తిరిగి అప్పగించినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ కమిషనరేట్ లో సీపీ అభిషేక్ మహంతి కారణంగా డిసెంబర్ కు ముందు… తరువాత అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది.

You cannot copy content of this page