దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్న నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రంలో జరిగిన ఓ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసుల ఎంట్రీతో ఇరు వర్గాలు అక్కడి నుండి వెల్లిపోయారు. ఆదివారం మంత్రి కేటీఆర్ నిర్వహించనున్న రోడ్ షో లైవ్ టెలికాస్ట్ కోసం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఎల్ఈడీ స్క్రీన్లను బిగించేందుకు ఏర్పాటు చేసిన స్టాండ్ తో పాటు ఇతర మెటిరియల్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ఘటనా స్థలం వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేయగా అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఆయా పార్టీల నాయకులతో పాటు స్థానికులు కూడా ఘటనా స్థలం వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం పెరిగిపోయింది. దీంతో గంభీరావుపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆయా పార్టీల నాయకులను అక్కడి నుండి పంపించేశారు.