ఒక యాక్సిడెంట్… ఇద్దరు సీఐలు… ఒకరు దుబాయ్… ఇంకా ఎందరో…

దిశ దశ, నిజామాబాద్:

గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇదే మరి. కారు ర్యాష్ డ్రైవింగ్ చేసి డివైడర్లను ఢీ కొట్టిన నేరం నుండి తప్పించుకునేందుకు చేసిన తప్పు పోలీసు వ్యవస్థనే తలదించుకునేలా చేసింది. యాక్సిడెంట్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి కారు నడిపిన వ్యక్తిని నిందితునిగా పేర్కొంటే కథ సుఖాంతం అయిపోయేది. ఈ కేసులో నిందితునిగా ఉన్నది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కాబట్టి అతన్ని కాపాడే ప్రయత్నం చేసిన తీరే విస్మయానికి గురి చేస్తోంది. రోడ్ యాక్సిడెంట్ కేసుగా నమోదు చేస్తే అందరూ సేఫ్ కావడంతో పాటు అధికారుల నుండి కూడా భేష్ అనిపించుకునే వారు. మాజీ ఎమ్మెల్యే కొడుకయినా చట్టానికి అతీతుడేం కాదని పోలీసులు చేతల్లో చూపించారని సమాజం కూడా కితాబిచ్చేది. కానీ పోలీసు అధికారుల అనాలోచిత చర్యలు, ఎమ్మెల్యే షకీల్… తన కొడుకును కాపాడాలనుకునేందుకు చేసిన ప్రయత్నం వల్ల ఈ కేసు మలుపులు తిరుగుతోంది.

తీగలాగితే…

పంజాగుట్టలోని సీఎం క్యాంప్ ఆఫీసు ముందు ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కారు నడుపుతూ డివైడర్లను ఢీ కొట్టాడు. అయితే వీరందరిని కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన తరువాత కథనంతా తారుమారు చేసి సంబంధం లేని వ్యక్తిని నిందితునిగా పేర్కొంటూ ఎప్ఐఆర్ జారీ చేశారు. ఈ విషయం బయటకు పొక్కడం… డీసీపీ విజయ్ కుమార్ విచారణ జరపడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొదట పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. రాహిల్ యాక్సిడెంట్ చేసిన రోజు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ కూడా తీసుకున్న పోలీసు అధికారులు దర్యాప్తును లోతుగా చేపట్టారు. పోలీసు అధికారులు, మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆయన కొడుకు రాహిల్ లకు సంబంధించిన కాల్ రికార్డ్ డాటా (సీడీఆర్) సేకరించి ఈ యాక్సి డెంట్ తరువాత ఏం జరిగిందని కూడా ఆరా తీశారు. ఈ వ్యవహారంలో పోలీసు అధికారుల మితిమీరిన జోక్యం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ యాక్సిడెంట్ తో సంబంధం లేని నిజామాబాద్ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ షకీల్ తనయుడిపై చూపిన మమకారం వెలుగులోకి వచ్చింది.  దీంతో సీఐ ప్రేమ్ కుమార్ ను అరెస్ట్ చేయడంతో పాటు రాహిల్ ను దుబాయ్ కి పంపించేందుకు సహకరించిన అబ్దుల్ వసిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

రాబంధువు కథేనా…

వంద గొడ్లను తిన్న రాబందువు ఒక్క గాలివానకు కుప్పకూలిపోయిందన్న తీరుకు ప్రత్యక్ష్య ఉదాహారణగా పంజాగుట్ట సీఎం క్యాంప్ ఆఫీసు ముందు డివైడర్లను ఢీ కొట్టిన ఘటన. బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నామన్న ధీమాతో షకీల్ తో పాటు అతని అనుచరులు ఈ సామ్రాజ్యం అంతా మాదే ఇక్కడ మేమేం చెప్పిందే చట్టం అన్న  రీతిలో వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కూడా షకీల్ లేదా ఆయన కొఠారి కనుసన్నల్లోనో ఏ పనైనా జరగాలన్న కండిషన్ తో పాలన కొనసాగించారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా… ఆ ఇంటి పై మరో ఫ్లోర్ వేయాలన్నా..? నిర్మాణాలకు ఇసుక కావాలన్నా, బాధితులు ఠాణా మెట్లెక్కాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ బోధన్ ఎమ్మెల్యే నియంతలా వ్యవహరించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజ్యం వారి చేతిలోనే ఉడడంతో రాచరికాలు వెలగబెడుతున్నారని… ఎన్నికల వరకూ ఈ బాధలు భరించాల్సిందేనని భావించిన బోధన్ ప్రజలు ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే భ్రమల్లో కొనసాగిన షకిల్ తానేం చేసినా చెల్లుతుందన్న ధీమాతో తన కొడుకు చేసిన యాక్సిడెంట్ ను బయటకు పొక్కనీయకుండా చేయాలని ప్రయత్నించి చతకిలపడిపోయారు. ఆయన అత్యుత్సాహం కాస్తా ఇద్దరు పోలీసు అధికారులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకునేలా చేసింది.  అంతేకాకుండా ఓ చిన్న యాక్సిడెంట్ కేసుగానే భావించి రాహిల్ ను నిందితునిగా పేర్కొనాలని షకీల్ సూచించినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదు. యాక్సిడెంట్ కేసులో పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఒక వేళ అరెస్ట్ చేసినా కోర్టులో బెయిల్ కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. తాను చేసింది తప్పేనని కోర్టు ముందు ఒప్పుకున్నట్టయితే సాధారణ జైలు శిక్షో లేక జరిమానా విధించే అవకాశం ఉండేది. కానీ రాహిల్ తాను చట్టానికి దొరకవద్దని భావించడం అతన్ని కాపాడే ప్రయత్నం చేయడంతో ఈ కేసు ఎన్నెన్నో మలుపులు తిరుగుతోంది. చిన్న కేసును స్వయం కృతాపరాథంగా వ్యవహిరించడంతో ఇద్దరు సీఐల వ్యవహారం వెలుగులోకి రాగా  పలువురి అరెస్ట్ కు దారి తీసింది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా కేసు నమోదు చేయాల్సి వచ్చింది. అయితే ఈ కేసు విషయంలో విదేశాలకు చెక్కేసిన రాహుల్ ను పట్టుకునేందుకు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది ప్రమేయం ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. చిన్న తప్పు నుండి బయట పడాలని చేసిన ప్రయత్నం భారీ నెట్ వర్క్ ను వెలుగులోకి తెచ్చినట్టయింది. 

You cannot copy content of this page