స్మార్ట్ సిటీ… స్మార్ట్ థింకింగ్… స్థానికుల అద్భుతమైన ఆచరణ..!

దిశ దశ, స్మార్ట్ సిటీ:

నిధులు వరద ఏరులై పారిన కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఓ విచిత్రం సాక్షాత్కరించింది. ప్రధాన రహదారిపైనే ఓ మొక్క ఎదుగుతున్న తీరు బల్దియా యంత్రాంగం పనితీరుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. టూరిస్టులను ఆకట్టుకునేందుకు నిర్మించిన తీగల వంతెన, సర్కిళ్ల సుందరీకరణ చేపట్టిన బల్దియా యంత్రాంగానికి స్థానికులు ఓ బోనస్ కూడా ఇచ్చారు. చూడడానికి విచిత్రంగా ఉన్నా స్థానికులు అమలు చేసిన ఈ విధానం ఈ ప్రాంతం మీదుగా వచ్చివెల్లే వారిని ఆలోచింపజేస్తోంది.

తీగల వంతెన…

కరీంనగర్, వరంగల్ రహదారిని కలుపుతూ నిర్మించిన తీగల వంతెనకు నగరం నుండి వెల్లే రహదారుల్లో ఒకటైన హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డు చర్చనీయాంశంగా మారింది. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ సమీపం నుండి తీగల వంతెనకు వెల్లే మార్గంలో నడి రోడ్డుకు ఓ గుంత పడింది. దీంతో స్థానికులు ఆ గుంతలో ఓ మొక్కను నాటి రక్షణగా ఎయిర్ కూలర్ ఫ్రేమ్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం మీదుగా వాహనాల రాకపోకలు ఇటీవల కాలంలో పెరిగిపోవడంతో వాహనదారులు ఆ గుంతలో పడకుండా ఉండేందుకు ఓ మొక్కను నాటినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ మొక్క ఉన్న విషయాన్ని గమనించాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా ఫ్రేమ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ మొక్కపై అందరి దృష్టి పడుతున్నా… బల్దియా అధికారులు చూపు పడడం లేదా అన్నదే పజిల్ గా మారిపోయింది. వందల సంఖ్యలో వాహనాల రాకపోకలతో పాటు బల్దియా అధికారులు కూడా ఈ ప్రాంత మీదుగా వచ్చి పోతుంటారు. డంప్ యార్డుకు వెల్లడం, వాటర్ ట్యాంకుల పర్యవేక్షణ, చెత్త శుద్దీకరణ కోసం కొనుగోలు చేసిన మిషిన్ ఇక్కడే ఉండడంతో కార్పోరేషన్ అధికారులు ఆ ప్రాంతం మీదుగా వెళ్లక తప్పని పరిస్థితే. అయినప్పటికీ ఆ గుంతకు మరమ్మత్తులు చేసేందుకు మాత్రం మునిసిపల్ అధికారులు ముందుకు రాకపోవడం స్థానికులను విస్మయం వ్యక్తం చేస్తోంది.

గతంలోనూ…

అయితే ఇదే చోట గతంలో కూడా గుంత పడిన సందర్బాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడు ఆ గుంతను పూడ్చినప్పటికీ మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కార్పోరేషన్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో మొక్కను నాటడం వల్ల అటు పర్యావరణాన్ని పెంచిపోషించినట్టు కావడంతో పాటు ప్రమాదాలను కూడా నివారించినట్టు అవుతుందని స్థానికులు అంటున్నారు. అయితే తరుచూ ఒకేచోట గుంత పడుతుండడానికి అసలు కారణమేంటన్న విషయంపై బల్దియా అధికారులు దృష్టి సారించనట్టుగా అయితే స్పష్టం అవుతోంది. కాంట్రాక్టర్ నిర్మాణం జరపినప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదా లేక అక్కడ భూమి బలహీనంగా ఉందా అన్న విషయంపై ఆరా తీసి సమస్య పరిష్కరానికి చొరవ చూపనట్టుగా అర్థం అవుతోంది. మరో వైపున క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత లోపాలను గమనించ లేదా..? కాంట్రాక్టర్ కూడా నిర్మాణ సమయంలో ఎదురవుతున్న సమస్యను బల్దియా అధికారులకు వివరించారా లేదా అన్నది తెలియడం లేదు. ఓ నిర్మాణం జరిగేప్పుడు ఖచ్చితంగా కాంట్రాక్టర్లు బిడ్ దక్కించుకున్న తరువాత తమ పనిని తాము చేసుకపోకుండా సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకరావల్సిన అవసరం కూడా ఉంటుందని తెలుస్తోంది. నిర్మాణ సమయంలో ఎదురైన అవాంతరాలను అధిగమించేందుకు అప్పటికప్పుడు ఇంజనీరింగ్ విభాగం రీ ఎస్టిమేట్లు చేసే వెసులుబాటు ఉన్నందున అప్పుడే ఈ గుంత గురించి పట్టించుకోవల్సిన ఆవశ్యకత ఉంటుందని అంటున్నారు. ఈ గుంతను ఇలాగే వదిలేస్తే వర్షాకాలంలో కానీ, వరద నీరు తరుచూ ప్రవహించినట్టయితే గంతలోకి నీరు చేరి మిగతా రోడ్డును కూడా డ్యామేజ్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదన్న విషయాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page