ఇటుక మాటున గంజాయి ఘాటు

బ్రేక్ డౌన్ తో వెలుగులోకి వచ్చిన వ్యవహారం

పోలీసుల తనిఖీతో గుట్టు రట్టు

దిశ దశ, మంచిర్యాల:

బ్రేక్ డౌన్ అయి నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న ఓ ట్రాక్టర్ రోడ్డు పక్కన ఆపేసి ఉంది. తనిఖీలు చేస్తున్న పోలీసుల కంట పడిన ఈ ట్రాక్టర్ ను స్టేషన్ కు తరలించి అందులో ఏముందోనని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. సిమెంట్ ఇటుకలు రవాణా చేసే ట్రాక్టరే కదా అనుకుని పోలీసులు వదిలేయకుండా ఆరా తీయడంతో గంజాయి ప్యాకెట్లు దర్జాగా సరఫరా అవుతున్నాయని గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాక్టర్లలో సాగుతున్న గంజాయి దందా గుట్టు రట్టు చేశారు. ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రాకు గంజాయి సరఫరా అవుతోందని గుర్తించి ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో రామగుండం సీపీ రెమా రాజేశ్వరీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ట్రాక్టర్ లో సాగుతున్న గంజాయి అక్రమ రావాణా గురించి వివరించారు. ఈ ట్రాక్టర్ లో రూ. 93 లక్షల విలువ చేసే 465 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దొరికిన ఆ‘ధారం’

ఈ నెల 23న శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద ట్రేస్ చేసిన ఈ ట్రాక్టర్ ను ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెండు రోజులు అయినా ఆ ట్రాక్టర్ గురించి ఎవరూ రాకపోవడంతో అనుమానించిన పోలీసులు ఇటుకలను ట్రేలర్ నుండి దింపించారు. అందులోంచి బయటపడ్డ ప్యాకెట్లను చూసి పోలీసులు ఒక్కసారగా షాకయ్యారు. పైన సిమెంట్ ఇటుకలు పెట్టి లోన గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నారని గుర్తించి ట్రాక్టర్ లో ఆధారాల కోసం గాలించగా అందులో ఓ ఆదార్ కార్డుతో పాటు డిజిల్ పోయించకున్న స్లిప్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా బలిమెలకు చెందిన జగబందు క్రిసాని, చిత్ర సేన్ క్రిసానిలను అరెస్ట్ చేశారు.

గురు ఈశ్వర్ ల మహిమే…

ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని సమీప గ్రామాల్లో గంజాయి కలెక్ట్ చేసుకుని తమను మహారాష్ట్రకు తరలించాలని గురు, ఈశ్వర్ అనే ఇద్దరు చెప్పారన్నారని పోలీసులకు అరెస్ట్ అయిన నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. కొంతకాలంగా ఈశ్వర్, గురులు ఇద్దరు కూడా ఈ పద్దతినే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈశ్వర్, గురులు చెప్పినట్టుగా చిత్రకొండ ప్రాంతంలో గంజాయి పండిస్తున్న వారి నుండి సేకరించి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్టుగా కూడా ఒప్పుకున్నారు. అయితే వీరు ఎంతకాలంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు..? ఎక్కడికెక్కడికి తరలిస్తున్నారు అన్న వివరాలు కూడా తెలుసుకునే పనిలో ఉన్నామని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి మీడియాకు తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులు ఇద్దరిని కూడా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నామన్నారు. ట్రాక్టర్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నిందితులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న శ్రీరాంపూర్ పోలీసులు సీపీ అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, జైపూర్ ఏసీబీ మోహన్, సీఐలు సుధాకర్, జి రమేష్ బాబు, ఎస్సైలు ప్రసాద్, ఉపేందర్, రాజేష్, రాజ వర్దన్, కానిస్టేబుళ్లు మల్లేశ్, జి సతీష్ లు కీలక భూమిక పోషించారని సీపీ వివరించారు.

You cannot copy content of this page