ఏపీ TO యూపీ వయా టీజీ

దిశ దశ, హైదరాబాద్:

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఊపాయాలు అన్నట్టుగా తయారైంది స్మగ్లర్ల తీరు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న తీరే అత్యంత విచిత్రంగా మారుతోంది. ఇప్పటి వరకు చాక్ లెట్స్ లో గంజాయి కలిపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ట్రావెల్స్ బస్సుల్లో రవాణా చేసిన సంఘటనలూ ఉన్నాయి. కానీ వీరు మాత్రం పోలీసులు తనిఖీలు చేసినా చిక్కకుండా ఉండేందుకు ఎంచుకున్న మార్గాన్ని చూస్తే ఔరా అనాల్సిందే.

ఓఆర్ఆర్ పై…

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమానస్పందంగా ఉన్న రెండు కార్లు నిలిపి ఉండడంతో అనుమానించిన ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. హుటాహుటిన కార్ల వద్దకు చేరుకున్న పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేయడా సీట్లలో దాచి పెట్టిన గంజాయిని గుర్తించారు. అయితే కారులో ఉన్న గంజాయి అంతా కూడా స్వాధీనం చేసుకున్న ఈ బందం కనెక్ట్ చేయకుండా ఉన్న సీఎన్జీ సిలిండర్ కనిపించింది. కారు ఇంజన్ కు కనెక్ట్ చేయకుండా ఉన్న సీఎన్జీ సిలిండర్ కారులో తీసుకెళ్లడం ఎందుకో అన్న అనుమానంతో నిందితులను ప్రశ్నించిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. సీఎన్జీ సిలిండర్ ను కట్ చేసి లోపల గంజాయి స్టోర్ చేసి యథావిధిగా వెల్డింగ్ చేసి కారు డిక్కీలో పెట్టుకుని బయలు దేరారు. అయితే ఓఆర్ఆర్ వద్ద కార్లలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీఎన్జీ సిలిండర్ ను గమనించడంతో సరికొత్త తరహాలో అవుతున్న స్మగ్లింగ్ వ్యవహారం బట్టబయలు అయింది. దేశంలో ఇప్పటి వరకు సీఎన్జీ సిలిండర్లలో గంజాయి స్మగ్లింగ్ అవుతుండగా పట్టుకున్న కేసు ఇదే తొలిసారని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ గంజాయిని ఏపీ నుండి ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాకు తరలిస్తున్నామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. స్మగ్లింగ్ ముఠా నుండి రూ. 19.50 లక్షల విలువ చేసే 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

You cannot copy content of this page