బియ్యపు దారులు మూసుకపోలేదా..? సరిహద్దుల్లో పట్టుబడుతున్నాయెందుకు..?

 

దిశ దశ, దండకారణ్యం:

సరిహధ్దుల్లో పీడీఎస్ రైస్ దందా ఇంకా ఆగడం లేదా..? తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించినా లాభం లేకుండా పోతోందా..? నిత్యం బియ్యం తరలించే వాహనాలు పట్టుబడుతున్న తీరు దేనికి సంకేతం..?

నిత్యకృత్యమేనా..?

మహారాష్ట్రలోని సరిహధ్దు ప్రాంతానికి చేరుతున్న బియ్యం దందా ఇంకా కొనసాగుతున్నట్టుగానే ఉంది. బియ్యం అక్రమ రవాణా చేసే వాళ్లపై పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా స్మగ్లింగుకు మాత్రం బ్రేకులు పడనట్టుగా స్పష్టం అవుతోంది. ఈ వ్యవహారంపై భూపాలపల్లి ఎస్సీ కిరణ్ ఖరే సీరియస్ గా తీసుకుని ఈ దందాతో ఎవరెవరికి సంబంధం ఉంది అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను భూపాలపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నా… సబ్పీడీ బియ్యం దందా చేస్తున్న వారు మాత్రం తమ పంథాను వీడడం లేదు. గోదావరి, ప్రాణహిత నదుల మీదుగా వేసిన వంతెనలను ఇంతకాలం రాచ మార్గాలుగా తయారు చేసుకున్న వ్యాపారుల తీరుపై సరిహద్దు ప్రాంత పోలీసులు కన్నెర్రజేస్తున్నారు. తాజాగా శుక్రవారం కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 25 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకోవడంతో అక్రమర రవాణా మాత్రం ఆగడం లేదని స్ఫష్టం అవుతోంది. అలాగే నాలుగైదు రోజుల క్రితం చెన్నూరు ప్రాంతం మీదుగా తరలి వెల్తున్న ఓ వాహనం బోల్తా పడడంతో అందులో తరలిస్తున్న బియ్యాన్ని హుటాహుటిన వేరే వాహనాల్లో సరిహధ్దులు దాటించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అర్థరాత్రి వేళల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విషయం సమీపంలోని పోలీసు అధికారులకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తాపడ్డ వాహనంతో పాటు అందులో ఉన్న కొన్ని రేషన్ బియ్యం బ్యాగులను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ వాహనానికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్టుగా సమాచారం. అయితే పగటి పూట పోలీసుల దాడులు ఎక్కువ అయ్యాయన్న ఉద్దేశ్యంతో అర్థరాత్రి వేళల్లో అక్రమ రవాణా చేస్తున్నట్టుగా ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

అదే వారికి లాభమా..?

అయితే సరిహద్దుల మీదుగా తరలి వెల్తున్న బియ్యం దందా విషయంలో గతంలో పట్టుకుని కేసులు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేయకపోవడం వల్లే అక్రమ వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేషన్ బియ్యం పట్టుబడినప్పుడు పోలీసులు వాహనాలతో పాటు ఓ వ్యాపారిపై చాలా వరకు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే సదరు వ్యాపారిపై పలు కేసులు నమోదయినప్పటికీ దందాను మాత్రం నిలిపేవేసేందుకు సాహసించడం లేదని స్ఫస్టం అవుతోంది. ఈ వ్యవహారంలో అరెస్ట్ అవుతున్న సదరు వ్యాపారి వీల్ చైర్ కే పరిమితం కావడంతో అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించే పరిస్థితి ఉండదని, వెంటనే కోర్టులు కూడా అతనికి బెయిలు ఇస్తారన్న కారణంతో దందా కొనసాగిస్తున్నారన్న చర్చ ఈ ప్రాంతంలో సాగుతోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న సదరు వ్యాపారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టయితే అతన్ని జైలులో ఉంచే పరిస్థితులు లేవన్న కారణంతో బెయిలు మంజూరు చేస్తారన్న నమ్మకంతోనే దర్జాగా దందా సాగిస్తున్నారని స్పష్టం అవుతోంది. బడా వ్యాపారులు కూడా ఇతన్ని ముందు పెట్టి ఈ దందా చేయడం వెనక అసలు కారణం కూడా ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ పీడీ యాక్టు అమలు చేసినా అతన్ని జైలుకు తరలించే పరిస్థితి లేదని, హెల్త్ కండిషన్స్ కారణం చూపించి వెంటనే బయటకు వచ్చే అవకాశం ఉంటుందని సదరు వ్యాపారిని ముందు ఉంచి వెనక నుండి దందా నడిపిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. బడా మాఫియా అంతా బయటకు రాకుండా… కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకునేందుకు సదరు వ్యాపారి పరిస్థితి అడ్వంటేజ్ గా మారిపోయిందన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆరా తీస్తే…

అయితే సివిల్ సప్లై అధికారులు సరిహద్దులు దాటిపోతున్న బియ్యానికి సంబంధించిన వ్యవహారంపై కొరడా ఝులిపిచేందుకు కఠినమైన చట్టాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం అవుతోంది. రూ. వందల కొట్ల విలువ చేసే రేషన్ బియ్యం సరిహద్దులు దాటి పోవడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పలు మార్లు రేషన్ బియ్యం దందా కేసుల్లో ఇరుక్కున్న వారిని లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల వెనక ఉన్న బడా బాబులు గుట్టు కూడా వెలుగులోకి వస్తుందని. ఈ దందాకు ఇన్వెస్ట్ చేస్తున్న వారిని, పలుకుబడి ఉపయోగించే వారిని కట్టడి చేసినట్టయితే రేషన్ బియ్యం దందాకు శాశ్వత బ్రేకులు వేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page