జర్నలిస్టుల కీలక నిర్ణయం
దిశ దశ, భూపాలపల్లి:
ఎదురు చూసి చూసి… విసిగి వేసారిన జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారం కోసం సరికొత్త పంథాలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు స్థానిక నాయకులును అభ్యర్థించినా ఫలితం లేకపోవడంతో ఇక ఉద్యమనేతకే లేఖలు రాయాలని నిర్ణయించారు. నిలువ నీడ కోసం ఇంటి స్థలం, అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన హెల్త్ కార్డు రెండంటే రెండే ఇప్పించండి సారూ అంటే లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. టీయూడబ్లుజే (ఐజేయు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు జిల్లా కమిటీ అధ్యక్ష్య కార్యదర్శులు క్యాతం సతీష్ కుమార్, సామంతుల శ్యామ్ లు ఓ ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద పోస్టు కార్డులు రాసే కార్యక్రమాన్ని ప్రారంభించి నేరుగా పోస్ట్ ఆఫీసుకు వెల్లి పోస్ట్ చేయునున్నామని తెలిపారు. జిల్ల్లాలోని జర్నలిస్టులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరై సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ చూపాలని కోరారు. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టుల గురించి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పదే పదే కొనియాడారని, స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత సీఎం హోదాలో కూడా కేసీఆర్ జర్నలిస్టుల పోరాట పటిమను కూడా మెచ్చుకున్నారన్నారు. అయితే జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇచ్చే విషయంతో పాటు జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కూడా వినియోగంలో లేకుండా పోయాయని వారన్నారు. ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాసి పంపించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని భావించామని, ఇందులో భాగంగానే బుధవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సతీష్, శ్యాంలు తెలిపారు.