అసువులు బాసిన వారెందరో..?
దిశ దశ, వేములవాడ:
విప్లవోద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అట్టుడుకిపోయిన కాలమది. పీపుల్స్ వార్, జనశక్తి కార్యకలాపాలతో సాయుధ పోరు చేసిన నక్సల్స్… వారిని ఏరివేసే పనిలో నిమగ్నమైన పోలీసులకు మధ్య ప్రచ్ఛన్న యుద్దమే సాగిందప్పుడు. సైద్దాంతిక నిర్మాణంతో రాజ్యానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టిన నక్సలైట్లు తమ తొలి లక్ష్యాన్ని పోలీసులపై అన్నట్టుగా ముందు సాగాల్సి వచ్చింది. శాంతియుత వాతావరణం కోసం పోలీసులు తమ తొలి టార్గెట్ నక్సల్సే అన్నట్టుగా వ్యవహారించాల్సి వచ్చింది. దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో తుపాకులు ఎక్కుపెట్టి పోరాటం చేసిన నక్సల్స్ వర్గాలను అణిచివేయడమే ప్రధాన పనిగా పోలీసులు ఆయుధాలకు పని చెప్పాల్సి వచ్చింది. కేవలం దాడులు, ఎదురు దాడులే కాకుండా సైద్దాంతికంగా కూడా ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నించేపనిలో కొంతమంది పోలీసు అధికారులు నిమగ్నం అయి కొత్త తరహాలో ఎత్తులు వేస్తూ ముందుకు సాగిన చరిత్ర ఉమ్మడి కరీంనగర్ లో నెలకొంది. సరిగ్గా అటువంటి కోవలోనే కొనసాగాయి ఈ వ్యూహాలు కూడా.
అమరుల స్థూపాలు…
ఎన్ కౌంటర్లలో మరణించిన నక్సల్స్ స్మారకార్థం ఆయా నక్సల్స్ గ్రూపులు స్థూపాలను ఆవిష్కరించడం ఆరంభించారు. 1990వ దశాబ్దం నుండి పీపుల్స్ వార్, జనశక్తి పార్టీలకు చెందిన నాయకత్వం విప్లవ పంథాలో అసువులు బాసిన వారిని స్మరించుకునేందుకు ప్రత్యేకంగా స్థూపాలను ఆవిష్కరించే వారు. ఈ క్రమంలో పశ్చిమ కరీంనగర్ జిల్లాలో ఈ స్థూపాల ఆవిష్కరణ పెద్ద ఎత్తున చేశారు. తమకు పట్టున్న గ్రామాల్లో స్మారక స్థూపాలను నిర్మించి ప్రారంభించేందుకు నక్సల్స్ ప్రాధాన్యత ఇచ్చే వారు. కొత్తగా ఆవిర్భవించిన జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నక్సల్స్ అమరవీరుల స్థూపాలు చాలా గ్రామాల్లో నేటికీ కనిపిస్తుంటాయి. ఎన్ కౌంటర్లలో హతమైన వారి కోసం ఆయా విప్లవ పార్టీలు స్థూపాలను నిర్మించేందుకు ప్రత్యేక శ్రద్ద వహించేవి.
శాంతి స్థూపాలు…
2010 ప్రాంతంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పటి వరకు నక్సల్స్ కార్యకలాపాలను అణిచివేయడంతోనే సరిపెట్టిన పోలీసులు శాంతి స్థూపాలను నిర్మించడం ఆరంభించారు. నక్సల్స్ చేతిలో మరణించిన పోలీసులను స్మరిస్తూ శాంతి స్థూపాలను ఏర్పాటు చేశారు. అప్పటి ఎస్సీ దేవేంద్ర సింగ్ చౌహాన్(డీఎస్ చౌహాన్) బీర్పూర్ లో శాంతి స్థూపం ఏర్పాటు చేయించారు. దీంతో సరికొత్త పంథాలో పోలీసులు ముందుకు సాగబోతున్నామన్న సంకేతాలు పంపించారు. ఆ తరువాత చందుర్తిలో కూడా మరో శాంతి స్థూపాన్ని నిర్మించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ శివార్లలో పీపుల్స్ వార్ పార్టీ తొలిసారి మందుపాతర పేల్చింది. అంతేకాకుండా పీపుల్స్ వార్ లో కొండపల్లి సీతారామయ్య తరువాత కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముప్పాళ లక్ష్మణ్ రావు స్వగ్రామం కూడా బీర్పూరే కావడం గమనార్హం. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన అగ్రనేత గ్రామం నుండే శాంతి స్థూపాల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టడం సంలచనంగా మారింది. అయితే ఆ తరువాత నెలకొన్న పరిస్థితుల్లో మిగతా ప్రాంతాల్లో మాత్రం పోలీసులు శాంతి స్థూపాల నిర్మాణం చేపట్టలేదు. కానీ నక్సల్స్ గ్రూపులతో సాయుధ పోరు సాగించిన పోలీసులు సైద్దాంతికంగా కూడా వ్యతిరేకతను ప్రదర్శించేందుకు చేసిన ప్రయత్నాల్లో శాంతి స్థూపాల నిర్మాణం ఒకటిగా చెప్పవచ్చు.