పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ వ్యవహారంతో వెలుగులోకి…
దిశ దశ, హైదరాబాద్:
జల మార్గం గుండా ఇతర ప్రాంతాలకు తరలించే సరుకుల విషయంలో ట్రాన్స్‌షిప్‌మెంట్ విధానం స్మగ్లర్లకు అనుకూలిస్తోందా..? అక్కడి నుండి సరుకు విదేశాలకు వెల్తున్నదంటే అంతా సాఫీగానే ఉందన్న సర్టిఫికెట్ వచ్చినట్టేనా..? షిప్పింగ్ రవాణా వ్యవస్థకు ఇతర రవాణా వ్యవస్థలకు మధ్య ఉన్న లింకేంటీ అన్నదే ఇప్పుడు అసలైన చర్చ మొదలైంది. తాజాగా కాకినాడ పోర్టు నుండి పీడీఎస్ రైస్ వెల్తున్న షిప్ ను అక్కడి అధికారులు పట్టుకోవడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ లు ఘటనా స్థలాన్ని సందర్శించి నావను సీజ్ చేయాలని ఆదేశించడంతో పోర్టుల్లో అసలేం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. ట్రాన్స్‌షిప్‌మెంట్ విధానంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించడం గమనార్హం.
కరీంనగర్ గ్రానైట్ స్కాం…
నావల ద్వారా సరుకుల బట్వాడా చేసే విధానంలో అవకతవకలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన సందర్భాలు కూడా
ఉన్నాయి. 2008 ప్రాంతంలో విశాఖ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కృష్ణపట్నం సహా పలు పోర్టుల్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా నుండి చైనాకు తరలిస్తున్న గ్రానైట్ బ్లాకుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వే బిల్లులు లేకుండానే రోడ్డు, రైల్ మార్గం ద్వారా పోర్టులకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న విషయాన్ని విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఆయా పోర్టుల్లో ఉన్న గ్రానైట్ బ్లాకుల విలువకు వన్ ప్లస్ ఫై పెనాల్టీ వేసి రూ. 750 కోట్లు వసూలు చేయాలని నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు 9 రవాణా ఏజెన్సీల ద్వారా గ్రానైట్ బ్లాకులు ఎగుమతి చేసిన 150కి పైగా గ్రానైట్ క్వారీలను క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని, చైనా నుండి ఇండియాకు హవాలా మార్గంలో, బినామీ అకౌంట్లలో తెప్పించుకున్నారని తేల్చారు. చైనాకు చెందిన ఓ కంపెనీ ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఈడీ తేల్చడంతో పాటు దాడుల్లో రూ. కోటికి పైగా నగదును కూడా సీజ్ చేశామని ఈడీ వెల్లడించింది. చైనా, హాంకాంగ్ వంటి దేశాలకు ఇక్కడి గ్రానైట్ బ్లాకులను
ఎగుమతి చేశారని, పనామా లీక్స్ తో సంబంధాలు ఉన్న లీ వ్యోహో కంపెనీ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు ఈడీ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో ఉందని కూడా ఈడీ విడుదల చేసిన ప్రకనటలో వెల్లడించింది.
తాజాగా…
తాజాగా కాకినాడ పోర్టు నుండి ప్రజా సరఫరా కోసం పంపిణీ చేస్తున్న పీడీఎస్ రైస్ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పోర్టులపై కఠినంగా వ్యవహరిస్తోంది ఏపీ అధికార యంత్రాంగం. డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ లు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రసాద్ ను కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించగా ఆయన స్థానంలో ఇంఛార్జి డీసీఎస్ఓగా లక్ష్మీదేవిని నియమించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను పోర్టులను తనిఖీ చేస్తానంటే అదికారులే నిలువరిస్తున్నారని అక్కడ వందలాది మంది ఉపాధి పోతుందని చెప్తూ తనను రానివ్వలేదని… అయినప్పటికీ తాను వినకుండా పోర్టు తనిఖీకి వచ్చానన్నారు. అంటే పోర్టుల నుండి అక్రమంగా పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ జరుతుందన్న విషయం ఉన్నతాధికారులకు ముందే తెలుసా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఎలా సాధ్యం..?
పోర్టుల నుండి విదేశాలకు వెల్లే ఆహారా పదార్థాలు, ఖనిజ సంపద, ఇతరాత్ర ముడి సరుకులు ఎగుమతి దిగుమతి చేసుకోవడంలో ఉన్న డొల్లతనాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రాన్స్‌షిప్‌మెంట్ విధానంలో ప్రధానంగా పోర్టులో వే బిల్లులతో పాటు ఇతరాత్ర సర్టిఫై కాపీలను పరిశీలించిన తరువాత రవాణాకు అనుమతిస్తారని తెలుస్తోంది. ఇందుకు ఆయా పోర్టుల నుండి రవాణా చేసేప్పుడు పోర్టు అధికారులు సర్టిఫై చేసిన మెటిరియల్ విదేశాలకు పంపించడం ఆనవాయితీగా సాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే పోర్టుల వద్దకు చేరుకున్న స్టాక్ అంతా కూడా సేఫ్ జోన్ కు చేరిపోయిందన్న ధీమాతా అక్రమార్కులు వే బిల్లులను రీ సైక్లింగ్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ గ్రానైట్ బ్లాకుల రవాణా విషయంలో ఇదే అంశం వెలుగులోకి వచ్చింది. కాబట్టి వే బిల్లులతో పాటు ఇతరాత్ర సర్టిఫికెట్లు స్థానిక రవాణా వ్యవస్థకు, మైనింగ్ విభాగానికి, రైల్వై ట్రాన్స్ పోర్ట్ వింగ్ కు, ట్రాన్స్‌షిప్‌మెంట్ విభాగానికి
అనుసంధానం చేయాలి. అంతేకాకుండా విదేశాలకు చేరిన తరువాత కూడా దిగుమతి చేసుకున్న ఆయా దేశాల సంస్థలు సంబంధిత ప్రభుత్వాల ద్వారా కూడా సర్టిఫై చేస్తేనే ఇక్కడి వ్యాపారులకు లైసెన్స్ అమల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధిత దేశాలు, భారత ప్రభుత్వం నేరుగా సమన్వయం చేసుకోవల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఇరు దేశాల వ్యాపారులు కుమ్మక్కైనప్పటికీ ఆయా దేశాల మధ్య ఎగుమతి, దిగుమతిలకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర వద్ద పక్కాగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం లైసెన్సులు జారీ చేసే కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం ఏర్పర్చుకుని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.