తండ్రి కోసం తనయుడు… తనయుడి కోసం తండ్రి…

జగిత్యాల డిఫరెంట్ పాలిటిక్స్

దిశ దశ, జగిత్యాల:

తనయుడి గెలుపు కోసం తండ్రి శ్రమిస్తుంటే… తండ్రి కోసం తనయుడు శ్రమిస్తున్నారక్కడ. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేత తన కొడుకు కోసం అహర్నిశలు కష్టపడుతుంటే… ఎమ్మెల్సీగా ఉన్న తండ్రిని అసెంబ్లీకి పంపించాలంటూ కొడుకు అభ్యర్థిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల్లో ఆసక్తికరంగా సాగుతున్న ప్రచారం తీరు ఎలా ఉందంటే…

జగిత్యాలలో ఇలా…

పట్టభద్రుల ఎమ్మెల్సీగా మండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న టీ జీవన్ రెడ్డి గెలుపునకు ఆయన తనయుడు రామచంద్రారెడ్డి (రాము) జగిత్యాలలో కలియతిరుగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ తన తండ్రి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు వివరిస్తూ రాము విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జీవన్ రెడ్డిని గెలిపించాలంటూ రాము ప్రత్యేకంగా చేస్తున్న ప్రచారం చర్చనీయాంశం అవుతోంది. యువతను ఆకట్టుకునేందుకు రాము ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎన్నికల తరువాత రాజకీయాలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు పోలింగ్ వరకు ప్రచారంలో నిమగ్నం అవుతుండడం కామన్. అయితే ఈ సారి మాత్రం ఆయన తనయుడు రాము మరింత ఎక్కువగా దృష్టి సారించి ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే…

జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేనే రాజకీయాల నుండి తప్పుకున్నారు. తన తనయుడి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకోవడంలో సఫలం అయిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తన తన తనయుడు డాక్టర్ సంజయ్ గెలుపునకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అటు ప్రచార సభలు నిర్వహిస్తూ ఇటు అంతర్గత సమీకరణాలు నెరుపుతూ ముందుకు సాగుతున్నారు విద్యాసాగర్ రావు. తొలిసారి రాజకీయ అరంగ్రేట్రం చేసిన డాక్టర్ సంజయ్ ని అసెంబ్లీకి పంపించాలన్న తపనతో ఉన్న విద్యాసాగర్ రావు పట్టుదలతో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. రాజకీయాల్లో నాణానికి ఒకవైపు మాత్రమే తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కి అనుకూలంగా పాలి‘ట్రిక్స్’లోని మరో కోణంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

You cannot copy content of this page