చెత్త వాహనంలోకి చేరిన సోనియమ్మ ఫ్లెక్సీలు


దిశ దశ, కరీంనగర్:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కావడానికి ప్రధాన కారణం సోనియా గాంధీయేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫష్టత ఇచ్చినప్పటికీ ఆమె ఫ్లెక్సీలకు మాత్రం అక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సాక్షాత్తు సీఎం అసెంబ్లీలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణం సోనియానే అని కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూల కారకురాలు… కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఫెక్సీలు మునిసిపల్ చెత్త వాహనంలోకి చేరాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. గురువారం కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం కరీంనగర్ మునిసిపల్ సిబ్బంది కాంగ్రెస్ నాయకులకు షాకిస్తూ ఆ ఫ్లెక్సీలను తొలగించి మునిసిపల్ వాహనంలోకి ఎక్కించారు. మునిసిపల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారన్న విషయం తెలుసుకున్న సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అక్కడకు చేరుకుని మునిసిపల్ సిబ్బంది చర్యలను అడ్డుకున్నారు. అధికారులతో మాట్లాడితే తమకు తెలియకుండా సిబ్బంది తీసేస్తున్నారని సమాధానం చెప్తున్నారని ఆయన వివరించారు. వాహనంలో వేసిన ఫ్లెక్సీలను బయటకు తీసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే స్వరాష్ట్ర కల సాకారం చేసిన సోనియా గాంధీ ఫ్లెక్సీలను మునిసిపల్ సిబ్బంది తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిరిసిల్లలోనూ…

మరో వైపున రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసల్లలోనూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం పట్ల నిరసన వ్యక్తం అయింది. టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మునిసిపల్ అధికారుల తీరుపై ఆందోళన వ్యకం చేశారు. అనుమతి తీసుకుని కట్టిన ఫ్లెక్సీలను సైతం ఎలా తొలగిస్తారంటూ అధికారులను నిలదీశారు. అధికార పార్టీకో న్యాయం ప్రతిపక్ష పార్టీలకో న్యాయమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తొలగించిన ఫ్లెక్సీలను వెంటనే ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేసిన సంగీతం శ్రీనివాస్ ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

You cannot copy content of this page